ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

21:26 - September 11, 2017

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తెట్టంగిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి...ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలుతీరుపై వాకబు చేశారు. పలువురు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజకీయాలకు చోటులేదని సీఎం చంద్రబాబు అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందేనని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు కొంతమంది అడ్డుపడుతున్నారని.. అలాంటి వారిని అడ్రస్‌ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదన్నదే తమ అభిమతమన్నారు.

175 అసెంబ్లీ సీట్లు టీడీపీ లక్ష్యం
2019లో 175 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడమే టీడీపీ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాల్సి వుంటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు ముందడుగు వేయాలని కోరారు. ఎటువంటి సమస్య ఉన్నా, తనతో చెప్పుకోవచ్చని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని చెప్పారు. 2014 ఎన్నికల్లో 1.5 శాతం ఓట్లను అధికంగా తెచ్చుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో 16 శాతం ఓట్లను తెచ్చుకున్నామని, కాకినాడలోనూ ఘన విజయం సాధించామని అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో డ్వాక్రా సంఘాలు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 25 కుటుంబాలకు ఒక మెంబర్‌ను నియమిస్తామని చెప్పారు. వారే ఆ 25 కుటుంబాల బాగోగులు చూసుకోవాలన్నారు. గ్రామకమిటీ, బూత్‌ కమిటీలను త్వరలోనే నియమిస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. 

Don't Miss