కుటుంబ వికాసమే..సమాజ వికాసం:చంద్రబాబు

21:43 - January 10, 2017

నెల్లూరు : కుటుంబ వికాసమే..సమాజ వికాసం..సమగ్ర రాష్ట్ర వికాసమే..సంపూర్ణ దేశ వికాసమని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా చెన్నూరులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..తాను ఆలోచించేది రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబ వికాసం కోసమే అన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని గతంలో కన్నా ఈసారి వినూత్నంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గతంలో కన్నా వినూత్నంగా నిర్వహిస్తున్నామన్న చంద్రబాబు
నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని గతంలో కన్నా వినూత్నంగా నిర్వహిస్తున్నామని చంద్రబాబు అన్నారు. మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుంచి కాన్పు వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. ఆ తర్వాత బిడ్డకు పోషకాహార లోపం లేకుండా చూస్తామని.. చదువు దగ్గర నుంచి ఉద్యోగం వచ్చే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి ఒక కుటుంబ వికాసం కోసమే ఆలోచిస్తాను : చంద్రబాబు
తాను ఆలోచించేది రాష్ట్రంలోని ప్రతి ఒక కుటుంబ వికాసం కోసమే అని చంద్రబాబు అన్నారు. సమాజ వికాసం కోసం ఇచ్చిన 10 సూత్రాలు అమలు కావాలంటే అధికార యంత్రాంగంలో బాధ్యత ఉండాలన్నారు.
చేపలు కూడా తింటున్నా : చంద్రబాబు
ఆరోగ్యానికి మంచివని చెప్పడంతో చేపలు కూడా తింటున్నానని తన ఆహార అలవాట్లను ప్రజలకు వివరించారు చంద్రబాబు. తాను పూర్తిగా సాధారణ ఆహారం తీసుకుంటానని, అందువల్లే, తాను ఆరోగ్యంగా వుండగలుగుతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ తాను తీసుకునే డైట్ ప్లాన్ గురించి చెప్పారు.

కూచిపూడి నృత్యానికి మతం లేదు, కులం లేదు : చంద్రబాబు
అంతకుముందు సభలో యువతుల కూచిపూడి నృత్యాలు చూసి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు..కూచిపూడి నృత్యానికి మతం లేదు, కులం లేదని.. కూచిపూడి గ్రామంలో పుట్టిన ఈ నృత్యం ప్రప్రంచ దేశాలకు వెళ్లిందని కొనియాడారు. మరోవైపు చంద్రబాబు బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. గాలేరి, గండికోట ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల నీటిని పైడిపాలెం రిజర్వాయర్‌కు విడుదల చేయనున్నారు.

 

Don't Miss