ఏపీలో 'అన్నా' క్యాంటీన్లు...

21:11 - July 11, 2018

విజయవాడ : నిరుపేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించే 'అన్న క్యాంటీన్లు' ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమయ్యాయి. విజయవాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన చంద్రబాబు.. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీలేకుండా పేదలకు ఆహారాన్ని అందిస్తామన్నారు. అనంతరం ప్రజలతో కలిసి సీఎం భోజనం చేశారు. ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. విజయవాడలోని విద్యాధరపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజలతో కలిసి భోజనం చేశారు.

పేదలకు కడుపునిండా అన్నం పెట్టిన ఎన్టీఆర్‌ పేరుతో క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. అన్న క్యాంటీన్లను చక్కగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని సూచించారు. ప్రతి క్యాంటీన్‌ దగ్గర 300 ల మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పేదలు, వృద్ధులకు అన్న క్యాంటీన్లు ఒక వరమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

నాణ్యమైన భోజనాన్ని తక్కువ రేటుకు అందించి పేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులోని మిర్చి యార్డు, అమరావతి రోడ్డు, ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మూడు అన్న క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు.

రాష్ట్రంలో పేద ప్రజల కడుపు నింపడం కోసమే 5 రూపాయలకే ఆహారాన్నందించే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడప నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ లోని ఆహార నాణ్యతను పరిశీలించి ప్రజలతో కలిసి భోజనం చేశారు.

పేదవారిని ఆదుకునేందుకే తక్కువ ధరకు ఆహారం అందించే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. రాజమండ్రిలోని క్వారీ సెంటర్‌లో ఆయన అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.

విజయనగరంలో అన్న క్యాంటీన్ ను కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. అనంతరం ప్రజలతో కలిసి భోజనం చేశారు. పేదల అభ్యన్నతి కోసం తమ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. తక్కువ ధరకే పేదవారి కడుపు నింపే మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.

కాకినాడలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను కాకినాడ సిటీ రూరల్‌ ఎమ్మెల్యేలు ప్రారంభించారు. తక్కవ ఖర్చుతో రుచికరమైన ఆహారాన్ని అందించేందుకే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని సిటి ఎమ్మెల్యే కొండబాబు వెల్లడించారు. దూరప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేవారికి, మోటార్ ఫీల్డ్ కార్మికులకు ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తపట్నంలో ఏర్పాటు చేసిన రెండు అన్న క్యాంటీన్లను ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్‌, జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌లు ప్రారంభించారు. మరో రెండు క్యాంటీన్లను వచ్చే నెలలో ప్రారంభం చేయనున్నారు. 

Don't Miss