కజకిస్తాన్ లో బాబు టీం..

07:32 - July 10, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు బృందం కజకిస్తాన్‌లో పర్యటిస్తోంది. అక్కడి అభివృద్ధి నమూనాను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రాజధాని నిర్మాణంలో ఆ దేశ సహాయ సహకారాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వండి అని సీఎం చంద్రబాబు కజకిస్థాన్‌ రక్షణ మంత్రి తస్మాగమ్‌ బెతోవ్‌ను కోరారు. కజకిస్థాన్‌, రష్యా పర్యటనలో భాగంగా తొలి రోజు సీఎం బృందం కజకిస్థాన్‌లో పర్యటించింది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం బృందానికి కజకిస్థాన్‌లో సంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది. తొలుత కజకిస్థాన్‌ పాత రాజధాని అల్మాటిలో పర్యటించిన చంద్రబాబు బృందం అక్కడ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కోక్‌ టోబోను సందర్శించింది. ఇక్కడికి చేరుకొనేందుకు నగరం మధ్య నుంచి కేబుల్‌ కార్‌ ద్వారా సీఎం బృందం ప్రయాణించింది. నగరం నడి మధ్య నుంచి వెళుతున్న కేబుల్‌కారు సీఎంను ఆకట్టుకుంది. ఈ తరహా పర్యాటక కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా తన వెంట ఉన్న అధికారులను కోరారు. అనంతరం సీఎం చంద్రబాబు కజకిస్థాన్‌ నూతన రాజధాని ఆస్తానాకు చేరుకొంది. అక్కడ ఆస్తానా మాజీ మేయర్‌, కజకిస్థాన్‌ రక్షణ మంత్రి బెతోవ్‌ సీఎం బృందానికి స్వాగతం పలికారు. బెతోవ్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కజకిస్థాన్‌, ఏపీ నడుమ ఎన్నో సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. సోవియెట్‌ రష్యా నుంచి విడిపోయిన కజకిస్థాన్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ఇటీవలే విభజనకు గురైన ఏపీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు.

రాజధాని నిర్మాణానికి మాకు పదేళ్లు పట్టింది: బెతోవ్‌...
జపాన్‌, దుబాయ్‌, సింగపూర్‌ ఆర్కిటెక్టులనే కాకుండా తమ దేశ ఆర్కిటెక్టులను కూడా పిలిపించుకోవాలని, వారి అనుభవాలు అమరావతి నిర్మాణానికి ఉపయుక్తంగా ఉంటాయని కజకిస్థాన్‌ మంత్రి బెతోవ్‌.. చంద్రబాబుకు సూచించారు. తమ రాజధాని నిర్మాణానికి పదేళ్లు పట్టిందని, అది 18 ఏళ్ల క్రితం నాటి మాటన్నారు. ఇప్పుడు సాంకేతికత పెరిగిందని అమరావతిని ఐదు నుంచి ఏడేళ్లలో నిర్మించుకోగలరనే నమ్మకం తనకుందన్నారు. నవీన నగరానికి సరైన ప్రణాళికతో కూడిన రవాణా వ్యవస్థ కీలకమని, అమరావతిలో ప్రజారవాణా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలన్నారు. నూతన రాజధాని నగర రూపకల్పనకు ప్రభుత్వ, విదేశీ, ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడులు సమీకరించామని కజకిస్థాన్‌ మంత్రి బెతోవ్‌ వివరించారు. పక్కా ప్రణాళిక ఉంటే నవీన నగరాలను నిర్మించడం సులభతరమేనన్న బెతోవ్‌, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 20 బిలియన డాలర్లకు తగ్గకుండా పెట్టుబడులను ఆకర్షిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
విభజన కష్టాల నుంచి నిర్మితమైన ఆస్తానా తరహాలోనే అమరావతి కూడా అద్భుతమైన నగరంగా ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కజకిస్థాన్‌ రక్షణ మంత్రి బెతోవ్‌. చంద్రబాబు దూరదృష్టితో ఆస్తానా కన్నా వేగంగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తమ రాజధాని నిర్మాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరించారు.. రష్యా నుంచి విడిపోయిన తొలినాళ్లలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకూ డబ్బులేని పరిస్థితి ఉండేదన్నారు. కష్ట సమయంలో తమ దేశంలోని వైద్యులు, ఉద్యోగులు ఎంతో సహకారం అందించారని ఏడాదిపాటు జీతాలు తీసుకోకుండా ఉచితంగా సేవలు అందించారని వివరించారు.

వేలాది మంది రైతుల భూములు...
నగర నిర్మాణానికి అనుసరించిన పద్ధతుల్ని తెలుసుకొనేందుకే కజకిస్థాన్‌ వచ్చామని చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణంలోను ఆయా పద్ధతులు, పరిజ్ఞానాన్ని వాడుకుంటామన్నారు. ఉమ్మడి రాష్ర్టానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనకు సైబరాబాద్‌ పేరిట కొత్త నగరాన్ని నిర్మించిన అనుభవం ఉందని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు మళ్లీ కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందని తెలిపారు. తనపై విశ్వాసంతో వేలాది మంది రైతులు రాజధాని కోసం భూములను ఇచ్చిన వైనాన్ని బెతోవ్‌కు వివరించారు.

Don't Miss