జనవరి నాటికి 2.5లక్షల ఇళ్ల నిర్మాణం

07:30 - October 12, 2017

 

గుంటూరు : జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ శాఖాధిపతులు, మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్వచ్ఛత, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అధికారులకు సీఎం చంద్రబాబు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. జనవరి నాటికి 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జూన్‌ నాటికి మరో 5లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలనీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే వివిధ సమస్యలను వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక , ఆర్థికేతర అంశాలుగా స్పష్టంగా వర్గీకరించుకోవాలన్నారు. వాటిని పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక మీదట స్వచ్ఛత, ప్రజాసమస్యల విషయంలో ప్రతి 15 రోజులకోసారి తాను వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా
వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా ఏపీ రూపొందాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం అధికారులంతా కష్టపడాలన్నారు. జిల్లాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలు వందశాతం ఓడీఎఫ్‌ సాధించాయని.. మిగతా 10 జిల్లాలు కూడా మరో 6నెలలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు. మొత్తం 12, 854 గ్రామ పంచాయతీలకుగాను.. ఇప్పటికి 4,600 గ్రామపంచాయతీలు పూర్తి ఓడీఎఫ్‌ను ప్రకటించాయని గుర్తుచేశారు. అధికారులు, మంత్రులు జిల్లాల పర్యటన చేస్తున్నప్పుడు టాయిలెట్లు, ఆయా పరిసరాలు పరిశీలించి స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిమట్టం వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 4గంటలపాటు సాగిన వీడియో కాన్ఫరెన్స్‌ చివరి వరకు ఉత్సాహంగా సాగింది. అయితే కొంతమంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

Don't Miss