క్షురకులపై చంద్రబాబు ఆగ్రహం..'గుండు' గీస్తామన్న నాయీలు.

21:24 - June 18, 2018

విజయవాడ : ఏపీలో దేవాలయ క్షురకుల వివాదం ముదిరింది. కనీస వేతనం నెలకు 15 వేల రూపాయలు చెల్లించి.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్చించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్న క్షురకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కేశఖండనకు 25 రూపాయలు చెల్లిస్తామన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్చించడం వీలుకాదన్నారు. క్షురకులు సమస్యలను సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చినా ... ముఖ్యమంత్రి చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వివాదం ముదిరింది. దీంతో క్షరుకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఖరిని తప్పుపట్టిన దేవాలయ క్షురకులు సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.

కనీస వేతనం 15 వేలు చెల్లించాలన్న డిమాండ్‌
ఏపీలోని దేవాలయాల్లో క్షురకులు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది. తమను దేవాలయ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం 15 వేలు చెల్లించాలన్న డిమాండ్‌తో విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. దీంతో విజయవాడ దుర్గగుడితోపాటు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వంటి ప్రముఖ దేవాలయాలల్లో కేశఖండనలు నిలిచిపోయాయి. దీంతో మొక్కు తీర్చుకోడానికి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

క్షురకులతో విఫలమయిన చర్చలు..
దేవాలయ క్షురుకుల సమ్మె నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని గ్రహించిన ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవతీసుకుంది. క్షురకులతో దేవాదాయ శాఖ మంత్రి కేఈ కష్ణమూర్తి చర్చలు జరిపారు. దేవాలయ ఉద్యోగులుగా గుర్తించి 15 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్లపై చర్చించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్న కేఈ హామీతో సంతృప్తిచెందని క్షురకులు... అర్థాంతరంగా చర్చలను బహిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో విధులు ముగింపుచుకొని క్యాంపు కార్యాలయాలనికి బయలుదేరిన సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో క్షురకులపై చంద్రబాబు మండిపడ్డారు.

క్షురకులపై మండిపడ్డ సీఎం చంద్రబాబు
సచివాలయం ప్రజా సమస్యలు పరిష్కరించే దేవాలయమని... ఇక్కడ అల్లరిచేస్తే కుదరదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశఖండనకు ప్రస్తుతం ఇస్తున్న 13 రూపాయలను 25 రూపాయలు పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించినా.. క్షరకులు వినిపించుకోవడంతో చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. కొన్ని దేవాలయాల్లో కేశఖండనకు ఐదు రూపాయలే చెల్లిస్తున్నారని క్షురకులు చెప్పగా.... ఇక నుంచి అన్ని గుళ్లలో కూడా 25 రూపాయలు ఇస్తామని చెప్పారు. క్షురకులను ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని దేవాదాయ శాఖ మంత్రి కేఈ కష్ణమూర్తి తేల్చి చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కేఈ కృష్ణమూర్తి వైఖరిని క్షురకలు తప్పుపట్టారు. సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్ల బంద్‌తోపాటు టీటీడీ క్షురకులను కూడా సమ్మెలోకి తేచ్చేందుకు ప్రయత్నిస్తామని నాయీబ్రాహ్మణ సంఘాలు ప్రకటించాయి. 

Don't Miss