నామినేటెడ్‌ పోస్టుల చంద్రబాబు దృష్టి

09:43 - May 20, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తోంది. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు కొన్ని నామినేటెడ్‌ పోస్టులనే భర్తీ చేశారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలానే నామినేటెడ్‌ పోస్టులు మిగిలిపోయాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు ఇప్పుడు వాటిని భర్తీ చేయడంపై దృష్టి సారించారు. పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్న వారికి నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చి సార్వత్రిక సమరానికి సిద్దం చేయాలని యోచిస్తున్నారు. పార్టీకోసం అహర్నిశలు కష్టపడ్డవారి లిస్ట్‌ను చంద్రబాబు తయారు చేస్తున్నారు. అయితే నామినేటెడ్‌ పోస్టులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇవ్వబోమని చంద్రబాబు ఇప్పటికే తేల్చి చెప్పారు. దీంతో వారంతా సైడైపోయారు.

అధికారంలోకి వచ్చి మూడేళ్లు
జూన్‌ 8వ తేదీ నాటికి టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతుంది. ఈలోగా అన్ని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టులన్నింటిలోకెల్లా అత్యంత ప్రదానమైనది టీటీడీ చైర్మన్‌. దీనికోసం ఇప్పటికే ఎంపీలు మురళీమోహన్‌, రాయపాటి సాంబశివరావు తనకే ఇవ్వాంటూ చంద్రబాబు కలిసి కోరారు. ప్రజాప్రతినిధులకు నాటినేటెడ్‌ పోస్టులు ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో మిగతా నేతలు టీటీడీ చైర్మన్‌ పదవి కోసం పోటీ పడుతున్నారు. నెల్లూరు జిల్లా సీనియర్‌నేత , మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. బీద మస్తాన్‌రావు ఇప్పటికే సీఎంను కలిసి టీటీడీ చైర్మన్‌ పదవి తనకే ఇవ్వాలని కోరారు. టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా తమకు అవకాశం కల్పించాలంటూ చాలామంది నేతలే పోటీపడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్న ఎ.వి. రమణ, బాపట్ల మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ ఈ పోటీలో ఉన్నారు.

ఆర్టీసీ చైర్మన్‌ రేసులో పుష్పరాజ్‌..
ఆర్టీసీ చైర్మన్‌ రేసులో గుంటూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి పుష్పరాజ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పుష్పరాజ్‌కు నామినేటెడ్‌ పదవి ఇస్తానని చంద్రబాబు హామీనివ్వడంతో ఆయన గంపెడాశలు పెంచుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన చందూ సాంబశివరావుకు కూడా ఏదో ఒక నామినేటెడ్‌ పదవి దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది. నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ చైర్మన్‌ రేసులో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డాక్టర్‌ శివప్రసాద్‌ పేర్లు వినిపిస్తున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని రికమండ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఇక 15 నెలలపాటు మద్దిపట్ట సూర్యప్రకాశ్‌, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, రామ్‌గోపాల్‌రెడ్డి, దాసరి రాజామాస్టార్‌ పేర్లు చంద్రబాబు ప్రాధాన్యతలో ఉన్నట్టు తెలుస్తోంది. శోభా హైమావతి, సత్యవాణిలకు చంద్రబాబు న్యాయం చేయాలని చూస్తున్నారు. మరి వీరందరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

Don't Miss