అన్ని జిల్లాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలి : సీఎం చంద్రబాబు

08:35 - November 15, 2017

గుంటూరు : వచ్చే ఏడాది మార్చికల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 140 రోజుల్లో అన్ని జిల్లాల్లో నూరుశాతం ఓడీఎఫ్‌ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.  ఇప్పటికే కృష్ణా, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను ఓడీఎఫ్‌గా ప్రకటించామని... ఈ నెలాఖరులోగా ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలను ఓడీఎఫ్‌గా చేస్తామన్నారు. 
మంత్రులు, విభాగాధిపతులతో చంద్రబాబు సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మంత్రులు, విభాగాధిపతులు, కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఓడీఎఫ్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, ఈ- ఆఫీస్‌, గ్రీవెన్స్‌ అంశాలపై సమీక్షించారు. 9వ తరగతి విద్యార్థులకు ఓడీఎఫ్‌పై ప్రాజెక్టు వర్క్‌ తప్పనిసరి చేసి, మార్కులు కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 16.58 లక్షల గృహాలకు మరుగుదొడ్లు లేవని  అధికారులు లెక్క తేల్చారు.  గడిచిన 40 రోజుల్లో 10లక్షల వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 65.56శాతం వరకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణంలో రాజీపడొద్దని, నాణ్యతలేకపోతే సహించేది లేదని సీఎం అన్నారు. 
ఓడీఎఫ్‌లో  94శాతం ప్రజలు సంతృప్తి
15 రోజుల్లో ఈ-కేవైసీ, చంద్రన్న బీమా సమాచారం అప్‌డేట్‌ చేయడం పూర్తికావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఆర్థికపరమైన అంశాలకు అర్జీలు మినహా మిగిలిన పెండింగ్‌ గ్రీవెన్స్‌ 45 రోజుల్లో పరిష్కరించాలని గడువు విధించారు.  వివిధ పథకాలు, కార్యక్రమాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిలను అధికారులు సీఎంకు వివరించారు. ఓడీఎఫ్‌లో 94శాతం, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో 94.22శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులకే చేరుతున్నాయో లేదో పరిశీలించాలని చంద్రబాబు వారిని ఆదేశించారు.

 

Don't Miss