తెలంగాణ ఆర్టీసీ నష్టాలకు కారణం ఎవరు ?

19:40 - May 17, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ జరుగుతుందా? సంస్థ అప్పుల్లో ఉంది, నష్టాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంత? గత వేతన ఒప్పందం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? పీఆర్సీ పట్ల ఆర్టీసీ యాజమాన్యం వైఖరేంటి? అధికార పార్టీకి చెందిన గుర్తింపు సంఘం ఏమంటోంది? ఇప్పటికే సమ్మె సైరన్ మోగించిన కార్మిక సంఘాలు ఏమంటున్నాయనే అంశంపై టెన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఆర్టీసీలో వేతన సవరణ గడువు ముగిసి ఏడాది గడిచింది. గత సంవత్సరం ఏప్రిల్‌ లో కొత్త పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. పే రివిజన్ కమిటీ వేసినప్పటికీ పీఆర్సీపై ఒక స్పష్టత రాలేదు. పద్నాలుగు నెలలుగా వేతన సవరణలో జాప్యం వల్ల కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘమైన టీఎంయూ ఛలోబస్ భవన్ కార్యక్రమం చేపట్టింది. ఇతర కార్మిక సంఘాలు జేఏసీ ఏర్పాటు చేసి పోరాటాలకు దిగడంతో ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది. మంత్రి హరీష్ రావు గౌరవాధ్యక్షుడుగా ఉన్న టీఎంయూ.. ప్రభుత్వంపై, ఆర్టీసీ యాజమాన్యంపై యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం సహా అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించింది. ఇదే సమయంలో సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల ఆశలపై నీళ్లు చల్లాయి.

గత వేతన సవరణ సందర్భంగా ఒక నెల ముందుగానే పీఆర్సీ ఇస్తామని సీఎం కేసిఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేతన సవరణ గడువు ముగిసి పద్నాలుగు నెలలయ్యింది. వేతన సవరణ చేయాలని కార్మిక సంఘాలు కోరితే ఇప్పవటికే.. ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీతాలు పెంచాలని కోరడమేంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాటలకు కార్మిక నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ నష్టాలకు కారణాలపై చర్చకు సిద్ధమా అంటూ స్వయంగా గుర్తింపు సంఘం నేత అశ్వత్థామ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆర్టీసీలో నష్టాలే లేవని నేతలంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సుమారు 60 డీపోలు లాభాల్లోకి వచ్చాయన్నారు. ఈ విషయాన్ని రవాణా శాఖా మంత్రి పలు సందర్భాల్లో చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. సంస్థ నష్టాలకు అసలు కారణాలు వేరే ఉన్నాయని వారంటున్నారు.

తెలంగాణలో ఆర్టీసీ నష్టాలకు డీజిల్ భారం ప్రధాన కారణం. టీఎస్ఆర్టీసీ ఏటా 20 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసిపై భారం పడుతూనే ఉంది. ఆర్టీసీకి ఈ నాలుగేళ్లలో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని సీఎం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ కొనుగోలు చేసిన డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టిన పన్ను రెండు వేల ఆరువందల 90 కోట్లరూపాయలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు డీజిల్ ధరలను పోల్చి చూస్తే లీటర్ కి 18 రూపాయలు పెరిగింది. ఆ భారం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీపై పడింది. మొత్తం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం డీజిల్ పైనే ఆర్టీసి ఖర్చు పెట్టింది.

ఆర్టీసీ కార్మికులు వేతనాలు అడిగితే ఇతర రాష్ట్రాలతో సీఎం పోల్చడం తగదన్నారు. అలా పోల్చినట్టయితే.. కేరళ ప్రభుత్వం బడ్జెట్లో మూడువేల కోట్లు, తమిళనాడు ప్రభుత్వం తాజా బడ్జెట్ లో నాలుగు వేల ఏడు వందల కోట్లు కేటాయించింది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో ఆర్టీసీకి కేటాయించింది 11 వందల కోట్ల రూపాయలు మాత్రమే. ఆర్టీసీకి సాయం చేయక పోగా ఆర్టీసీకి ఇవ్వాల్సిన రీయింబర్స్‌మెంట్ ను కూడా నెలల తరబడి ఇవ్వడం లేదు. ఆర్టీసీ కార్మికలు కష్టపడి పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయలు నష్టం వస్తోందని సీఎం, రవాణా మంత్రి చేస్తోన్న వ్యాఖ్యలను కూడా నేతలు తప్పుపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు రోజుకు 12 కోట్ల రూపాయలు ఆదాయం తెస్తున్నారన్నారు. ఇందులో ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో కోటిన్నర రూపాయలు ప్రతీ రోజు చెల్లిస్తున్నారని వారంటున్నారు.

మరోవైపు సిఎం హాట్ కామెంట్స్ చేసిన తరుణంలోనే గుర్తింపు సంఘం నేతలతో మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షుడు మంత్రి హరీష్ రంగంలోకి దిగి నేతలను చల్లబరిచే కార్యక్రమానికి పూనుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో పాటే తమకు కూడా తీపి కబురు అందుతుందని భావించిన టిఎంయూ నేతలకు ఆశాభంగమే మిగిలింది.

మంత్రి వర్గ ఉప సంఘం చర్చలు ఎటూ తేల్చకపోవడం, సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం, గుర్తింపు సంఘం నేతల వేచి చూసే ధోరణి నేపథ్యంలో పది యూనియన్లతో కూడిన జేఏసీ ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చింది. పద్నాలుగు నెలలుగా వేతన సవరణ కోసం ఎదురు చూస్తున్న కార్మికుల ఆగ్రహం సమ్మె బాట పట్టే అవకాశం స్పష్ఠంగా కనిపిస్తోంది.

Don't Miss