ఫెడరల్ ఫ్రంట్ మీటింగ్స్ షురూ..

21:39 - April 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌, బీజేపీ కబంద హస్తాల నుంచి దేశ ప్రజలను కాపాడేందుకే ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని ముందుకు తీసుకువెళ్తున్నట్లు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ మూస రాజకీయ విధానాలతో దేశ సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కాంగ్రెస్‌, బీజేపీ పాలనే కారణమని కేసీఆర్‌ విమర్శించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాల మధ్య సాగునీటి యుద్ధాలు సృష్టించి తమాషా చూస్తున్నాయని మండిపడ్డారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయిన కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి
కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా బెంగళూరు వెళ్లిన కేసీఆర్‌.. జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్‌ వెంట నటుడు ప్రకాశ్‌రాజ్‌, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయతలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఇరువురు నేతలు చర్చించారు.

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ
దేవెగౌడతో జరిపిన భేటీలో కేసీఆర్‌.. తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించారు. తన ఉద్దేశాలను దేవెగౌడకు వివరించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రజా సమస్యలతోపాటు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అన్నదాతల ఆత్మహత్యలు వంటి అంశాలపై చర్చించారు. డెబ్బై సంవత్సరాలుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్‌, బీజేపీయే కారణమన్న అంశంపై సమాలోచనలు జరిపారు. కర్నాటక-తమిళనాడు మధ్య కావేరీ నదీ జలాల వివాదంపై చర్చించారు. అలాగే కృష్ణా జలాల పంపిణీకి 2004లో ఏర్పాటు చేసిన జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మోదీ నేతృత్వంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చినా మెరుగైన పాలన అందించలేకపోయిందని, 2019 ఎన్నికల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక పాత్ర పోషిస్తుందని కేసీఆర్‌ అన్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ రాజకీయ పార్టీనైనా చేరవచ్చని మాజీ ప్రధాని దేవెగౌడ ఆహ్వానించారు.

గుణాత్మక మార్పుల కోసం : కేసీఆర్
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి భేటీ కావాలని కేసీఆర్‌, దేవెగౌడ నిర్ణయించారు

Don't Miss