డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభం

15:49 - December 23, 2016

సిద్దిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్త గ్రామాలు రెండూ సంపూర్ణ నగదు రహిత గ్రామాలయ్యాయి. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.  ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నసీఎం.. నగదు రహిత లావాదేవీల అమలులో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాలు స్వయం సహాయకంగా మారాలని సూచించారు. 
ఎర్రవల్లి, నర్సన్నపేటలలో ప్రారంభం 
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ ప్రజల సొంతింటి స్వప్నం నెరవేరింది. సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రెండు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 
మొత్తం 600 ఇళ్లు
మొత్తం 600 ఇళ్లలో వేదమంత్రోచ్ఛరణల మధ్య గృహప్రవేశాలు జరిగాయి. ఇరు గ్రామాల్లోని ప్రజలంతా ఒకేసారి గృహప్రవేశం చేశారు. ఒక్కో ఇంట్లో ఒక్కో బ్రహ్మణుడిచే వాస్తుపూజ, పూణ్యాహవచనం, సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. 7.53 గంటలకు గ్రామస్తులు గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, నర్సన్నపేటలను సీఎం కేసీఆర్ నగదు రహిత గ్రామాలుగా ప్రకటించారు. 
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం గొప్ప ముందడు : సీఎం కేసీఆర్
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఓ గొప్ప ముందడుగన్న సీఎం కేసీఆర్.. ఇప్పటి వరకు మనం ఎక్కింది ఒక్క మెట్టు మాత్రమేనని, ఇదే స్ఫూర్తితో ఇళ్ల నిర్మాణంలో ముందుకుపోదామని సీఎం పిలుపునిచ్చారు. గృహప్రవేశం చేసిన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలకు సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నగదు రహిత లావాదేవీల అమలులో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండాలని.. స్వయం సహాయ గ్రామాలుగా నిలవాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణకు బాటలు వేసేలా ఎర్రవల్లి, నర్సన్నపేటలు ఉండాలన్నారు.
ప్రతి ఇంటికి తాగునీరు : సీఎం కేసీఆర్ 
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లోని డబుల్ బెడ్‌రూం ఇళ్లకు..మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు..కల్యాణ మండపం, భోజనశాల నిర్మాణం, ఇంటర్నెట్‌ సేవలతో పాటు మరిన్ని ప్రత్యేకతలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. డబుల్‌ బెడ్‌ ఇళ్లలోకి గృహప్రవేశం చేసిన గ్రామస్తులు ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

Don't Miss