బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : సీఎం కేసీఆర్

21:23 - July 7, 2018

హైదరాబాద్ : బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. చిన్న వ్యాపారాలు, కులవృత్తులు చేసుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండా 100శాతం రాయితీతో ఆర్ధికసాయం చేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో  లబ్దిదారుల ఎంపిక కోసం కలెక్టర్‌ చైర్మన్‌గా నలుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ స్థాపించామని.. వచ్చే ఏడాది మరో 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

బీసీలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో బీసీ వర్గాల సంక్షేమ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 

వెనకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. బీసీ కులాల్లో కులవృత్తులు చేసుకుని జీవించే వారికి అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసుకునేందుకు... చిన్న వ్యాపారాలు చేసేవారికి... కులవృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే 100శాతం రాయితీతో ఆర్ధికసాయం అందించాలని సూచించారు. గ్రామాలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్డీఏ పీడీ సభ్యులుగా కమిటీని నియమించాలన్నారు. లబ్ధిదారుల జాబితా సిద్దంకాగానే ఆర్ధిక సాయం చేయాలని సూచించారు. బీసీ సంక్షేమశాఖకు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇందుకోసం వినియోగించాలన్నారు కేసీఆర్‌. 

వచ్చే ఏడాది మరో 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఇక మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఎక్కడైనా సీట్లు మిగిలితే... బీసీలకే కేటాయిస్తామని... బీసీ కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కల్లు దుకాణాల పునరుద్ధరణతో పాటు చెట్ల రకం రద్దు చేయడం వల్ల గీత కార్మికులకు మేలు కలుగుతుందన్నారు. గీత కార్మికులకు కావాల్సిన విషయాలపై మరోసారి అధ్యయనం చేసి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యాదవులకు ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేయడంతో... ఆర్థికంగా బలోపేతమవుతున్నారని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున చేపల పెంపకం వల్ల ముదిరాజ్, గంగపుత్రులతో పాటు మత్స్యకారులు లబ్ది పొందుతున్నారన్నారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి తీసుకున్న చర్యల వల్ల పద్మశాలీలకు మేలు జరిగిందన్నారు. విశ్వకర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతో పాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారాలు చేసే వారికి పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బీసీలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు.

Don't Miss