తాగునీటికే తొలి ప్రాధాన్యం : కేసీఆర్

21:28 - September 11, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ప్రగతి భవన్‌లో మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.. ఈ పథకం అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదీ జలాల వినియోగంలో మంచినీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటి మట్టాలను పాటించాలన్నారు. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరాకోసం నదీజలాల్ని ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.మిషన్ భగీరథ కోసం 30 పాయింట్లను రిసోర్సులుగా పెట్టుకున్నామని సీఎం అధికారులకు గుర్తుచేశారు.

ఆపరేషనల్ రూల్స్...
ఏ రిసోర్స్ దగ్గర ఏడాదికి ఎన్ని నీళ్లు అవసరమో అంచనా వేయాలని సూచించారు. ఆ అంచనాకు 25 శాతం అదనంగా నీరు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టుల వారీగా ఆపరేషనల్ రూల్స్ రూపొందించాలని ఆదేశించారు. నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించుకుంటూ పనులు పూర్తిచేయాలన్నారు.ప్రాజెక్టుల నీటిని మంచినీటిగా వాడుకోవడం తెలంగాణలో ఒక హక్కు అని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరంతో పాటు కొత్త ప్రాజెక్టులు పూర్తయితే చాలా నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ప్రస్తుత సోర్సులను మిషన్‌ భగీరథకు వాడాలని సీఎం చెప్పారు. వాటి నుంచే నీటి సరఫరా జరగాలన్న సీఎం.. ఇందుకోసం మొదటిదశ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయ్యాక శాశ్వత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరికే నదీ జలాలను గ్రామాలకు అందించాలని సీఎం చెప్పారు. నీటిపారుదల శాఖతో సమన్వయం కోసం మిషన్ భగీరథ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని కేసీఆర్ ఆదేశించారు.మూడో విడత హరితహారంపై సీఎంవో అధికారులతో కేసీఆర్‌ సమీక్షించారు.. ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే వికారాబాద్‌ ప్రాంతాన్ని మరో ఊటిగా తీర్చిదిద్దే అవకాశాలున్నాని చెప్పారు.. మూడో విడత హరితహారంలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.. ఇప్పటివరకూ 29 కోట్ల మొక్కలు నాటామని... మరో పది కోట్ల మొక్కల్ని ఈ నెలాఖరులోగా నాటాలని సూచించారు.

సంచార పశు వైద్య శాలలు
రాష్ట్రవ్యాప్తంగా సంచార పశు వైద్య శాలలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.. పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చిన గొర్రెలు, ఇతర పశువులకు వైద్యం అందించడానికి ఈ వైద్య శాలలు ఉపయోగించాలన్నారు.. అలాగే బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.. ఇప్పటికే సగానికి పైగా చీరలు జిల్లా కేంద్రాలకు చేరాయని స్పష్టం చేశారు. ఈ చీరల్ని గ్రామాలకు చేర్చాలని... ఈ నెల 18నుంచి మూడు రోజులపాటు వీటిని పంపిణీ చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

Don't Miss