నేడు ఉద్యోగ సంఘాలతో కేసీఆర్‌ భేటీ

07:51 - May 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ప్రగతిభవన్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాలతో వారి సమస్యలపై చర్చించనున్నారు. డిమాండ్ల పట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మరోవైపు తమ డిమాండ్లపై కేసీఆర్‌ ఎలా స్పందిస్తారోనని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఉద్యోగుల డిమాండ్లపై చర్చించనున్న కేసీఆర్‌ 
ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించనున్నారు. నేరుగా ముఖ్యమంత్రే ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాల నేతలతో చర్చలు జరుపుతారు. వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తారు. ఉద్యోగుల సమస్యలపై కేసీఆర్‌ ఇప్పటికే కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మిక సంఘాలో చర్చలు జరిపింది. చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో కేసీఆర్‌కు అందజేసింది. 
ప్రభుత్వం ముందు ఉద్యోగుల 18 ప్రధాన డిమాండ్లు
1. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడం
2. కొత్త పీఆర్సీని అమలు చేయడం
3. ఉద్యోగుల బదిలీలు చేపట్టడం
4. ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయడం
5. రిటైర్మెంట్‌ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడం
7. ఉద్యోగులకు శాఖల వారీగా ప్రమోషన్లు చేపట్టడం
8.ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను రప్పించడం
9. కొత్త జిల్లాల్లో ఆర్డర్‌ టూ సర్వ్‌ పేరుతో పని చేస్తున్న వారిని పర్మినెంట్‌ చేసి, హెచ్ ఆర్ ఏ పెంచడం
10.కాంట్రాక్ట్‌ , ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు  పెంచడం
తమ డిమాండ్లపై సీఎంతో చర్చించనున్న ఉద్యోగులు
ఉద్యోగులు ప్రధానంగా ప్రభుత్వం ముందు 18 ప్రధాన డిమాండ్లు పెడుతున్నారు.  అందులో మొదటిది సీపీఎస్‌ విధానం. పాత పెన్షన్‌ స్కీమ్‌నే అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.  ఇక రెండోది కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయడం. మూడోది ఉద్యోగుల బదిలీలు. ఇక నాలుగోది ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అంశం. వీటితోపాటు ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడం... ప్రమోషన్లు, ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తిరిగిరప్పించడంలాంటి డిమాండ్‌ ఉన్నాయి. అంతేకాదు.. కొత్త జిల్లాలో ఆర్డర్‌ టూ సర్వ్‌ పేరుతో పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేసి..వారి  హెచ్‌ఆర్‌ఏ పెంచడం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు పెంచడం కూడా వీరి డిమాండ్లలో ప్రధానమైంది.  ప్రభుత్వం తొలగించిన కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తిరిగి తీసుకోవాలనే డిమాండ్‌ను కూడా ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్నాయి. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు కూడా తమ డిమాండ్లపై సీఎంతో చర్చించనున్నారు.
నివేదికపై అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్‌
మంత్రివర్గ ఉపసంఘం అందజేసిన నివేదికపై  సీఎం కేసీఆర్‌.. సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ, న్యాయశాఖ అధికారులతో చర్చించారు. ఏఏ సమస్యలను పరిష్కరించగలం, సర్కార్‌పైన ఎంత భారం పడుతుంది, న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై అధికారులతో  చర్చించారు. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకోని సీఎం సమస్యలపై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు చెపుతున్నాయి.  ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపిన తర్వాత సీఎం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలో చర్చల్లో ప్రభుత్వం ఏం తేల్చుతుందన్న దానిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రకటన కోసం వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
 

 

Don't Miss