సామాజిక న్యాయం ద్వారానే అభివృద్ధి: కేరళ సీఎం

19:42 - March 19, 2017

హైదరాబాద్: సామాజిక న్యాయం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో మహాజన పాదయాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహాజన పాదయాత్ర నిర్వహించిన తమ్మినేని బృందానికి అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్ర విజయవంతం కావడం అనేది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదహారణ అని తెలిపారు. తెలంగాణ సమాగ్రాభివృద్ధికి, సామాజిక న్యాయం కోసం ఏమి చేయాలనే దానిపై చర్చించాలన్నారు. చర్చించే సమయం లేకపోతే సీపీఎం సూచించిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సీపీఎం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిందని, వీటి ద్వారా సమస్యలకు పరిష్కరించే విధంగా చూడాలి. సమాజంలో మార్పులు రావాల్సి ఉందని, అట్టడుగున ఉన్న వారి సమస్యలు పరిష్కరించాలని ఇవన్నీ క్షేత్రస్థాయిలో వెళితే తెలుస్తుందన్నారు. అట్టడుగున్న వారి అభివృద్ధి కాకపోతే అది అభివృద్ధి అనరని తెలిపారు. సీపీఎం విడుదల చేసిన సమగ్ర ప్రణాళికపై చర్చించాలని, సామాజిక న్యాయమే తగిన పరిష్కారమన్నారు. కేసీఆర్, బీజేపీ, ఆరెస్సెస్ ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా మహాజన పాదయాత్ర విజయవంతం అవ్వడం కమ్యూనిస్ట్ మరియు సామాజిక శక్తుల ఘనత అని తెలిపారు. సబ్ ప్లాన్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు కావడం లేదని, సబ్ ప్లాన్ ల ద్వారానే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. విభజన జరిగిన అనంతరం విధానాలు మారలేదని, అంతకుముందున్న సమస్యలు..విధానాలు పునరావృతమయ్యాయన్నారు. మహాజన పాదయాత్ర భారత దేశ మెజారిటీ ప్రజల బతుకుల్లో మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం కొత్త మలుపు అవుతుందన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మరింత వినాశకర విధానాలు అవలింబిస్తోందని, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వ విధానాలు లేవని కేవలం కార్పొరేట్ రంగానికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పాటు పని కల్పించాలని ఉండేదని, దీనిని ప్రస్తుతం నీరుగారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ హాయాంలో కాషాయ బీభత్సం జరుగుతోందని, ముఖ్యంగా మైనార్టీ వర్గాలపై జరుగుతోందన్నారు. ఎలా ఉండాలి..ఏమి తినాలి..ఇతరత్రా వాటిపై మాట్లాడుతున్నారని, పశువుల వ్యాపారాన్ని కూడా అనుమతించడం లేదని పేర్కొన్నారు. అజ్మీర్ పేలుళ్లలో సంఘ్ పరివార్ ప్రమేయం ఉందని పేర్కొన్నారు.

సామాజిక పోరాటాలు జరుగుతున్నాయని, విద్యార్థుల పోరాటాలు నిలబడాలని పేర్కొన్నారు. బీజేపీ గొప్ప విషయాలు సాధించలేదని, గోవా, మణిపూర్ లలో అనైతికంగా పాలన చేపట్టారని, యూపీలో గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. కేరళలో ప్రభుత్వం దీర్ఘకాలిక పథకాలు తీసుకున్నామని, హరిత కేరళ అనీ పేరు పెట్టామన్నారు. వైద్యం అందరికీ అందే విధంగా చూస్తున్నామని పేర్కొన్నారు.

Don't Miss