చిన్నారుల మృతికి కారణమైన వారిని వదిలిపెట్టబోం : యోగి

19:28 - August 13, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని చిన్నారుల మృతికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని... నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి చిన్నారుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.  బీఆర్‌డీ ఆసుపత్రిని కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కలిసి  ఆయన సందర్శించారు. ఆక్సీజన్‌ అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను , అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇవాళ కూడా మరో చిన్నారి ప్రాణవాయువు అందక చనిపోయింది.  సీఎం యోగి సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో దాదాపు 70మందికి పైగా చిన్నారులు ఆక్సీజన్‌ అందక మృతిచెందిన ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈఘటన జరుగడానికి రెండు రోజుల ముందే సీఎం ఇదే ఆస్పత్రిని సందర్శించి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాణవాయువు సిలిండర్లు సరఫరా చేసే గుత్తేదారు సంస్థకు బీఆర్‌డీ ఆసుపత్రి బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాను నిలిపివేశారు. దీంతో 70మంది అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యోగి సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో విచారణకు ఆదేశించారు.  మరోవైపు ఈ ఘటనపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని సీపీఎం కేంద్ర కమిటీ డిమాండ్‌ చేసింది.

 

Don't Miss