భావసారూప్య శక్తులతో ఐక్యపోరాటాలకు నిర్ణయం

21:22 - May 18, 2017

హైదరాబాద్‌: నగరంలోని ఎంబీ భవన్‌లో రెండు రోజుల పాటు జరిగిన సీపీఎం రాష్ట్రకమిటీ సమావేశాల్లో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల నిర్వహించిన మహాజన పాదయాత్ర విజయవంతం అయిందని పార్టీ అభిప్రాయపడింది. యాత్ర సందర్భంగా నేతల దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలపై భవిష్యత్‌ ఉద్యమాలు నిర్మించాలని నిర్ణయించారు. సామాజిక న్యాయసాధనకు వామపక్ష , సామాజిక సంఘాల ఐక్య ఉద్యమాలు నిర్మించడానికి కార్యాచరణను సిద్ధం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.

దేశంలో ఆర్థిక అసమానతలు...

మోదీపాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కార్పొరేట్‌ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ విధానాలు మార్చేశారని విమర్శించారు. ధనవంతులు లక్షల కోట్లకు పడగలెత్తుతుంటే.. పేద, మధ్యతరగతి ప్రజలు మరింత పేదలుగా మారుతున్నారని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న మత అసహనంపై ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో రక్షణ సంఘాల ఆగడాలు మితిమీరాయన్నారు. దళితులు, ముస్లీంలపై దాడులు జరుగుతున్నా.. ప్రధాని మోది మౌనంగా ఉంటున్నారని ఏచూరి విమర్శించారు.

భావసారూప్య శక్తులతో ఐక్య వేదిక ఏర్పాటుకు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారానికి, భావసారూప్య శక్తులతో ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ధర్నాచౌక్ ఉద్యమంలో అన్ని పార్టీలు ఒకే వేదిక పై వచ్చి పోరాటం చేశాయని .. ఇదే స్ఫూర్తిని భవిష్యత్‌ ఉద్యమాల్లో కూడా కొనసాగించాలని నిర్ణయించింది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో స్నేహ పూర్వక చర్చలపైనా పార్టీ చర్చించింది. ఈ సమావేశాల్లో సీతారాం ఏచూరితోపాటు , సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీరాఘవులు, ప్రకాశ్‌కారత్‌ కూడా పాల్గొన్నారు. 

Don't Miss