బీజేపీ దాడులపై సీపీఎం నిరసనలు

20:51 - March 7, 2018

కర్నూలు : త్రిపురలో లెనిన్ విగ్రహం ధ్వంసం, సీపీఎం కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు కలెక్టరేట్ వద్ద సీపీఎం ధర్నా నిర్వహించింది. నగరంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ,ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. త్రిపురలో గెలిచిన తరువాత... బీజేపీ తన వాస్తవ నైజాన్ని కనబరుస్తోందని సీపీఎం నేతలు ఆరోపించారు. బీజేపీ అరాచకాలకు విగ్రహాల విధ్యంసమే నిదర్శనమన్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. 
జనగామలో 
త్రిపురలో జరుగుతున్న మతోన్మాద దాడులను నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో సిపియం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన చేపట్టారు. ధర్నాలో ఎంఆర్ పీఎస్, టీజాక్ నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి నెహ్రూ పార్కు మీదుగా ఆర్టీసీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. హిందుత్వ వాదులది పిరికిపందల చర్య అంటూ.. సీపీఎం నేతలు మండిపడ్డారు. 
వికారాబాద్‌లో 
వికారాబాద్‌లో సీపీఎం నాయకులు ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. త్రిపురలో లెనిన్‌ విగ్రహం కూల్చివేత, సీపీఎం నాయకులపై దాడులకు వ్యతిరేకిస్తూ.. మోదీ దిష్టి బొమ్మతో రోడ్డుపైకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దిష్టి బొమ్మ లాక్కోవడంతో... పోలీసులు, సీపీఎం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలుపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు.

 

Don't Miss