ఎట్టకేలకు గొట్టిపాడు సందర్శన...

06:38 - February 3, 2018

గుంటూరు : నూతన సంవత్సరం రోజున అగ్రకులాల వారి చేతిలో దాడికి గురైన గుంటూరు జిల్లా గొట్టిపాడులోని దళితులను ఎట్టకేలకు సీపీఎం, దళిత సంఘాల నేతలు పరామర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు కేవీపీఎస్‌ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. దళితవాడలో ఏర్పాటు చేసిన సభకు దళితులంతా హాజరై.. తమ సమస్యలు నేతలతో మొరపెట్టుకున్నారు.

గొడవ జరిగిన తర్వాత అగ్రకులాల వారు తమను ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారో దళితులు సీపీఎం, కేవీపీఎస్‌ నేతలకు తెలిపారు. అనేక రకాలుగా హింసిస్తున్నారని వాపోయారు. దళితులను ఎవరూ పొలం పనులకు పిలవకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మొరపెట్టుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దళితుల పిల్లలతో ఎవరినీ మాట్లాడనివ్వడం లేదని, అగ్రకులాల వారు ఉంటున్న వీధుల్లోకి దళితులను రానివ్వడం లేదని.. మహిళలు సీపీఎం నేతలకు వివరించారు. నెల రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నట్టు తెలిపారు.

గొట్టిపాడు దళిత మహిళలు చెప్పిన సమస్యలను విన్న సీపీఎం, కేవీపీఎస్‌ నేతలు... దళితులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. అగ్రకులాల వారు అహంకారపూరితంగా దాడులు చేస్తోంటే.. పోలీసులు, అధికార యంత్రాంగం చూస్తూ ఊరుకుంటోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. దళితులపై దాడులు చేసిన వారు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారని... అసలు దోషులపై 307 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గొట్టిపాడు దళితులకు న్యాయం కోరుతూ ఈ నెల 23 ఛలో గుంటూరు నిర్వహిస్తామని, రాష్ట్రంలోని దళితులు అందరూ గుంటూరు వస్తారని ఆయన చెప్పారు.

నెల రోజులుగా గొట్టిపాడులోకి ఎవరినీ అనుమతించని ప్రభుత్వం ఎట్టకేలకు సీపీఎం, దళిత సంఘాల నేతలను అనుమతించింది. దళితుల పోరాటానికి తలవంచింది. గ్రామంలోకి ప్రవేశించిన నేతలు... దళితులపై దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం దళితులతో కలిసి భోజనం చేశారు. సీపీఎం, కేవీపీఎస్‌ నేతల రాకతో తమకు ధైర్యం వచ్చిందని, భరోసా లభించిందని గొట్టిపాడు దళితులు తెలిపారు.

Don't Miss