గణతంత్ర వేడుకలపై టీ.సర్కార్‌ దృష్టి

12:12 - January 12, 2017

హైదరాబాద్ : గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై తెలంగాణ సర్కార్‌ దృష్టి సారించింది. ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్‌ ఎస్పీ సింగ్‌.. వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నగరంలోని ప్రముఖ ప్రదేశాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. 
జనవరి 26 వేడుకలపై సీఎస్‌ సమీక్ష 
68వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. జనవరి 26 వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో సంబంధింత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలకు గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
పారిశుద్ధ్యం, మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు
వేడుకలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. ట్రాఫిక్‌ నియంత్రణను పర్యవేక్షించాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో పారిశుద్ధ్యం, మొబైల్‌ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. గన్‌పార్క్‌, క్లాక్‌టవర్‌, ఫతేమైదాన్‌లతో పాటు.. రాజ్‌భవన్‌, సెక్రటేరియెట్‌, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్‌లను విద్యుద్దీకరించాలని సూచించారు. 
విద్యుత్‌, మంచినీటి సౌకర్యం 
వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌, మంచినీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. వేడుకలను ప్రత్యక్ష ప్రసారం కోసం ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుక ప్రాంగణాలను పుష్పాలతో ముస్తాబు చేయాలన్నారు. వేడుకలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎస్‌ సూచించారు. 

 

Don't Miss