హైకోర్టు తీర్పుపై మమతాబెనర్జీ అసహనం

07:02 - March 18, 2017

కోల్ కత్తా : పశ్చిమబంగలోని మమతాబెనర్జీ సర్కారును కలకత్తా హైకోర్టు చిక్కుల్లో పడేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎంపీలపై సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయస్థానం ఆదేశించింది. అదికూడా కేవలం 72 గంటల్లోనే విచారణ జరిపి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చీఫ్‌ జస్టిస్‌ నిషితా మహత్రే, జస్టిస్‌ టి.చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

సీఎం మమత హయాంలో మూడు అతిపెద్ద కుంబకోణాలు...

పశ్చిమబంగ రాష్ట్రంలో ఇప్పటికే మూడు అతిపెద్ద కుంబకోణాలు వెలుగు చూశాయి. పార్టీ ఎంపీలు సుదీప్‌ బందోపాధ్యాయ, టపాస్‌ పౌల్‌లు, రోజ్‌వ్యాలీ కుంబకోణంలో 15వేల కోట్ల రూపాయల వరకూ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇద్దరినీ సీబీఐ అధికారులు గతంలో అరెస్టు చేశారు. ఇదికాకుండా శారదా కుంబకోణంలోనూ తృణమూల్‌ ప్రజాప్రతినిధులు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

2016 ఎన్నికల వేళ టీఎంసీ నేతలకు భారీ ముడుపులు....

ఇదే క్రమంలో, 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు భారీగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నారదాన్యూస్‌ సంస్థ స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఈ వ్యవహారాన్ని రట్టు చేసింది. టీఎంసీకి చెందిన ఆరుగురు ఎంపీలు, ముగ్గురు మంత్రులు, కోల్‌కతా మేయరు డబ్బులు తీసుకున్నట్లు ఈ సంస్థ వెలువరించిన దృశ్యాల ద్వారా వెల్లడైంది.

దృశ్యాల ఆధారంగా విచారించిన కలకత్తా హైకోర్టు.....

నారదాన్యూస్‌ సంస్థ బయటపెట్టిన దృశ్యాల ఆధారంగా కేసును విచారించిన కలకత్తా హైకోర్టు, ఇందులో మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్నందున, రాష్ట్ర పోలీసులు తోలుబొమ్మల్లా మారారని, అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది. కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన మమతాబెనర్జీ, దీనిపై సుప్రీంను ఆశ్రయిస్తామని తెలిపారు.

Don't Miss