దళితులను ఉపాధిహామీ పనికి రావొద్దన్నారు...

20:26 - April 1, 2018

కుమురంభీం ఆసిఫాబాద్ : ఎన్న చట్టాలు వచ్చినా... ఎన్ని ప్రభుత్వాలు మారినా.. దళితుల బతుకుల్లో మార్పు రావడం లేదు... వారి పట్ల వివక్ష మారడం లేదు. తక్కువ జాతి అని వారిపై వివక్షలు కొనసాగుతూనే  ఉన్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దళితులను దూరం పెడుతున్న అగ్రవర్ణాల పై స్పెషల్ స్టోరీ... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో నేటికి దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. గ్రామంలో దళితులకు జాబ్ కార్డులున్నా ఉపాధి హామీ పనికి రావద్దని అగ్రవర్ణాల ఆంక్షలు విధించారు. నాలుగు సంవత్సరాలుగా ఉపాధి హామీ కూలీ పనులకు దళితులను పిలవడం లేదు. 
మంచినీళ్లు కూడా పట్టుకోవద్దని కుల అహంకారం
ఇవే కాకుండా.. గ్రామంలో తమపై అనేక విధాలుగా ఆంక్షలు విధిస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. మంచినీటి బోరు వద్ద కూడా నీళ్లు పట్టుకోకుండా ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రోడ్లు, ఇతర సంక్షేమ పథకాలు మంజురైనా అవి కార్యరూపం దాల్చడం లేదని దళితులంటున్నారు. దళితవాడలో రోడ్లు, మరుగుదొడ్లు మంజూరైనా అగ్రవర్ణాలవారు నిర్మించడం లేదంటున్నారు. తమకు ఎలాంటి పనులు ఇవ్వడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక యుగంలో కూడా ఇంకా మూర్ఖత్వం భావజాలం కొనసాగుతుందంటున్నారు. సాటి మనిషిని కుల వివక్షతతో ద్వేషించే నీచ సంస్కృతి ఇంకా ఎన్నాళ్లు అని దళితులు ప్రశ్నిస్తున్నారు. పనులే కాకుండా కనీసం మనుషులు తాగేందుకు నీళ్లు కూడా పట్టుకోనీయకుండా సభ్యసమాజం తలదించుకునేలా అగ్రవర్ణాలు వ్యవహరించడం శోచనీయమని పలువురంటున్నారు. 

 

Don't Miss