ఫిడెల్‌ క్యాస్ట్రో మృతి పట్ల పలువురు నేతల సంతాపం

21:47 - November 26, 2016

హైదరాబాద్ : క్యూబా విప‌్లవయోధుడు, మహోద్యమకారుడు ఫిడెల్‌ క్యాస్ట్రో మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం తెలిపారు. క్యాస్ట్రో చనిపోయినా పోరాటస్ఫూర్తి కలకాలం నిలిచి ఉంటుందన్నారు. కమ్యూనిస్టులకు ఆదర్శంగా నిలిచిన క్యాస్ట్రో ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నిలవాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడ్డారు.
క్యూబా ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుంది : మోడీ 
క్యూబా విప్లవయోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మృతిపట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్నారీ, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్యూబా ప్రజలకు, ప్రభుత్వానికి తమ సానుభూతిని ప్రకటించారు. ఈ విషాద సమయంలో క్యూబా ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని మోడీ తెలిపారు. ఫిడెల్ కాస్ట్రో 20వ శతాబ్దపు వీరుడని పొగిడారు. ఆయన మృతితో భారత్ ఒక మంచి స్నేహితున్ని కోల్పోయిందని తన ట్విట్టర్ ట్విట్ చేశారు. 
క్యాస్ట్రో మృతి పట్ల వామపక్ష నేతలు సంతాపం  
క్యూబా యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల దేశవ్యాప్తంగా వామపక్ష నేతలు సంతాపం తెలిపారు. క్యూబా విప్లవానికే నేత కాదని.. ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేస్తున్న అందరికి నేతగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ తెలిపారు. ఫిడెల్‌ కాస్ట్రో మరణం విచారకరమైనదని సీపీఎం నేత రాఘవులు అన్నారు. చరిత్రలో కొత్త అధ్యాయనాన్ని లిఖించిన గొప్ప విప్లవకారుడు ఫిడెల్‌ కాస్ట్రో అని ఆయన అన్నారు. క్యాస్ట్రోకు ఎంబీ భవనలో సీపీఎం నేతలు నివాళులర్పించారు. క్యాస్ట్రో మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. కమ్యునిస్టులకు ఆదర్శంగా నిలిచిన క్యాస్ట్రో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఫిడెల్ క్యాస్ట్రో మరణం తీరని లోటని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. నిరంతరం పోరాటాలే క్యాస్ట్రోకు ఘనమైన నివాళి అని తెలిపారు. ఫిడెల్‌ క్యాస్ట్రోకు నల్లగొండ జిల్లా సీపీఎం నేతలు నివాళులర్పించారు. 40 ఏళ్ల పాటు క్యూబా అభివృద్ధికి క్యాస్ట్రో ఎంతో కృషి చేశారని తెలిపారు. 
క్యాస్ట్రో మృతికి పవన్ ట్విట్టర్ లో సంతాపం  
ఇక ఫిడెల్‌ క్యాస్ట్రో మృతిపై జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. ప్రజల్లో స్ఫూర్తి నింపిన నాయకుడికి జనసేన సెల్యూట్‌ చేస్తుందన్నారు. చెగువేరాతో క్యాస్ట్రో సాగించిన పోరాటాన్ని.. ఈసందర్భంగా మననం చేసుకుంటున్నామన్నారు. క్యూబన్ల ప్రజారోగ్యం కోసం క్యాస్ట్రో ఎంతగానో కృషి చేశారని ట్విట్టర్‌లో పవన్‌ తెలిపారు. 

 

Don't Miss