జైట్లీ నోట మళ్లీ పాత మాట

21:42 - February 8, 2018

ఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మళ్లీ పాతపాటే పాడారు. ఏపీ ఎంపీల ఆందోళనపై స్పందించిన ఆయన.. ఏపీకి సాయంపై ఎలాంటి నిర్దిష్ట ప్రకటనా చేయలేదు. గతంలో మాదిరిగానే ఇస్తున్నాం.. చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను ఇప్పటికే కొన్ని అమలు చేశామని, మరికొన్ని అమలు దశలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర విభజనకు తాము మద్దతిచ్చినా ఏపీ హక్కుల కోసం తాము పోరాడామన్నారు. రాష్ట్రానికి పలు జాతీయ సంస్థలు కేటాయించామని, వాటికి నిధులు ఇస్తున్నామని, ఇంకా ఇస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాలకు కూడా కొన్ని నిధులను కేటాయించామని తెలిపారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని నిధులు ఇస్తున్నామన్నారు. గత నెలలో నాబార్డ్‌ ద్వారా నిధులు ఇవ్వాలని ఏపీ సీఎం లేఖ రాస్తే అలానే ఇస్తున్నామని జైట్లీ చెప్పుకొచ్చారు. రెవెన్యూ లోటుకు సంబంధించి ఏపీ అధికారులతో కలిసి లెక్కలు వేస్తున్నామని, రైల్వే జోన్‌, పెట్రో కారిడార్‌కు సంబంధించి చర్చలు జరుపుతున్నాని జైట్లీ తెలిపారు. 

Don't Miss