ఒక్కరోజులోనే 'రద్దు'..

17:39 - January 10, 2017

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నదేనని ఆర్బీఐ.. పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన ఓ నివేదికలో వెల్లడించింది. 500, వేయి రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్రం సూచించిన మరుసటి రోజే ఓకే చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈమేరకు వీరప్పమొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన ఏడు పేజీల నివేదికలో ఆర్బీఐ స్పష్టం చేసింది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నదే: ఆర్బీఐ
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నదేనని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. నల్లధనం వెలికితీత, టెర్రరిస్టుల ఆర్థిక నిధులపై వేటు వేసేందుకు.. 500, వేయి రూపాయాల నోట్ల రద్దు చేయాలని కేంద్రం సూచించిన మరుసటి రోజే ఆర్బీఐ నోట్ల రద్దుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇదే విషయాన్ని వీరప్పమొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటంరీ కమిటీకి సమర్పించిన ఏడు పేజీల నివేదికలో స్పష్టం చేసింది.

2016, నవంబర్‌ 7న ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సూచన
పాత పెద్ద నోట్లు రద్దు చేయాలని 2016, నవంబర్‌ 7న ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం సూచించింది. నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు, తీవ్రవాదుల ఆర్థిక మూలాలను పెకలించేందుకు, నల్లధనం వెలికితీసేందుకు.. 500, వేయి రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకును కేంద్రం కోరిందని నివేదికలో తెలిపింది. నల్లధనం పెరగడానికి పెద్ద నోట్లు దోహదకారిగా ఉన్నాయని, బ్లాక్‌ మనీ లేకుండా చేస్తే దేశ ఆర్థికవ్యవస్థకు మేలు జరుగుతుందని కేంద్రం చెప్పినట్లు ఆర్బీఐ తన రిపోర్టులో పేర్కొంది. ఐదేళ్లలో నకిలీ 500, వేయి రూపాయల చలామణి పెరగడంతో.. తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయని వివరించింది.

ఐదేళ్లలో నకిలీ రూ.500, వేయి చలామణి పెరగడంతో సమస్యలు
కేంద్రం సూచన చేసిన తర్వాత రోజు సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్‌ బోర్డు పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అదేరోజు రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాత పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్‌ 8 అర్థరాత్రి తర్వాత పాత పెద్ద నోట్లు చెల్లవని చెబుతూ పరిమితులు, నియంత్రణలు విధించారు. 50 రోజుల తర్వాత పాత 500, వెయ్యి రూపాయల నోట్ల చెలామణిని పూర్తిగా రద్దు చేశారు.

 

Don't Miss