బైసన్ ఫోలో గ్రౌండ్ ఇచ్చేందుకు కేంద్రం సిద్దం

08:41 - May 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయ నిర్మాణానికి సికింద్రాబాద్‌లోని 60 ఎకరాల బైసన్ ఫోలో గ్రౌండ్ స్థలం ఇచ్చేందుకు కేంద్రం సూత్ర ప్రాయంగా అంగీకరించింది. ఈ విషయాన్ని రోడ్లు భవనాల శాఖ అధికారులు తెలిపారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. స్థలం అప్పగింతకు 2,3 నెలల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి చౌరస్తా వరకు, ప్యారడైజ్ నుండి శామిర్ పేట వరకు 2 ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు సెక్రటేరియట్ అధికారులు వెల్లడించారు. ఈ 100 ఎకరాలతో పాటు బైసన్ ఫోలో గ్రౌండ్స్‌కు చెందిన 60 ఎకరాలు కలిపి మొత్తం 160 ఎకరాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. అయితే ఇందుకు ప్రతిగా 1000 ఎకరాలు ఇవ్వాలని రక్షణ శాఖ కోరినట్లు తెలిపారు. రక్షణశాఖకు చెందిన 160 ఎకరాల స్థలం సిటి మధ్యలో ఉండటం..విలువైన భూమి కావడంతో..1000 ఎకరాలు వారు అడుగుతున్నట్లు సచివాలయ అధికారులు భావిస్తున్నారు.

రక్షణశాఖకు వెయ్యి ఎకరాలు
రక్షణశాఖకు వెయ్యి ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిన మాట వాస్తవమేనని అర్‌ అండ్‌ బి అధికారులు చెబుతున్నారు. ఈ 1000 ఎకరాలు వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో కేటాయిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ వెయ్యి ఎకరాలు ఒకే చోట ఎక్కడ ఇవ్వాలనేదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సచివాలయ తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

Don't Miss