చైతన్య కళాశాల బస్సు బీభత్సం...

10:17 - October 29, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మొన్న గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రమ్య మృతి చెందిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చైతన్య కళాశాలకు చెందిన బస్సు బీభత్సానికి ఇంటర్ విద్యార్థిని బలైంది. 
సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లడానికి జగద్గిరిగుట్టకు చెందిన రమ్య కూకట్‌పల్లి వద్ద రోడ్డు దాటుతోంది. అదే సమయంలో చైతన్య కళాశాలకు చెందిన బస్సు వేగంగా వచ్చి రమ్యను ఢీకొట్టింది. తలపై నుండి వెళ్లిపోవడంతో అక్కడికక్కడనే విద్యార్థిని మృతి చెందింది. 
అక్కడనే ఉన్న విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురై కళాశాలకు చెందిన బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థతి సమీక్షించారు. రమ్య మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. యాజమాన్యం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss