కేంద్రానికి ఘాటు లేఖ రాయనున్న బాబు...!

19:50 - October 10, 2018

విజయవాడ : కేంద్రానికి, ఏపీ సర్కార్ కు మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కేంద్రం తీరు కూడా ఏపీని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. వెనకబడిన జిల్లాలకు సాయం చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి ఘాటుగా లేఖ రాయాలని నిర్ణయించారు. అప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాకపోతే వచ్చే వారం పార్లమెంటు సభ్యుల బృందాన్ని దిల్లీకి పంపాలని భావిస్తున్నారు.

వెనకబడిన జిల్లాలకు ఇదివరకే ఇచ్చిన 350 కోట్ల రూపాయలు మళ్లీ వెనక్కి తీసుకోవడంపై కేంద్రానికి లేఖ రాసినా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు, ఇప్పుడు తెలంగాణకు సాయం చేసి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితిపై తీవ్రంగానే స్పందించాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే  కేంద్రానికి ఘాటుగా లేఖ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సహాయ నిరాకరణపై  వైసీపీ, జనసేన స్పందించకపోగా.. కేంద్రంపై పోరాడుతున్న తన ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకుంటున్నారు. కేంద్ర వైఖరిలో మార్పు రాకపోతే ఢిల్లీ వేదికగా కేంద్ర పెద్దలను నిలదీసేందుకు స్కెచ్‌ సిద్ధం చేస్తోంది. 

వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో బీజేపీని, ఇతర పార్టీలను టార్గెట్‌ చేసుకునే దిశగా టీడీపీ అధినాయకత్వం అడుగులేస్తోంది. వెనుకబడిన జిల్లాల గురించి.. వాటి అభివృద్ధి గురించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ నేతలు.. ఇప్పుడు  ఏం సమాధానం చెబుతారనే వాదనను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ -జనసేన  పార్టీలను టార్గెట్ చేయడానికి ఇదే అంశాన్ని బేస్ చేసుకోవాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది టీడీపీ. మరి ఏపీ టీడీపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

Don't Miss