కాస్మెటిక్‌ 'జిలుగు'ల వెనుక 'కన్నీటి' చారికలు..

12:44 - April 25, 2018

కళ్లు ఎన్నో భావాలను పలికించగలవు..మరెన్నో తణుకులను ఒలిగించగలవు..ఆడవారి కళ్లపై కవులు ఎన్నో పాటలు, కవిత్వాలను రాశారు. నిలువవే వాలు కనులదానా అంటు..సోగకళ్ల అందాలు చూడతరమా అంటు ఇలా ఎన్నో పాటలు ఆడవారి కళ్లపై అలా అలా జాలువారిపోయాయి. చారడేసి కళ్ళున్న వారి అందం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే, అందరి కళ్ళు పెద్దవిగా ఉండవు. అయితే, చిన్న కళ్ళు ఉన్నవారు కూడా తమ లుక్ ను మెరుగుపరచుకోవచ్చు. మేకప్ తో కళ్ళను పెద్దవిగా కనిపించేలా మార్చుకోవచ్చు. కంటికి కాటుక పెట్టుకుంటే ఆ కళ్ల అందం మరింతగా ఇనుమడిస్తుంది. కానీ గ్లామర్ రంగంలో వున్నవారు ఎక్కువగా కాస్మెటిక్స్ తోనే అందాన్ని ఇనుమడించుకుంటారు. ముఖ్యంగా మేకప్ లో హైలెట్ అయ్యేవి కళ్లు..ఆ కళ్లకు మరింత వన్నె తెచ్చేందుకు మెరుపులు తెచ్చేందుకు ఐ షాడో వినియోగిస్తుంటారు. మరి మెరుపుల వెనుక ఎందరి జీవితాలు మసకబారిపోతున్నాయో? ఎంతమంది జీవితాలు సజీవ సమాధి అయిపోతున్నాయో? ఎంతమంది చిన్నారుల జీవితాలు ఘనుల్లో మగ్గిపోతున్నాయో ఎప్పుడైనా? ఎవ్వరైనా ఆలోచించారా? కనీసం ఊహించారా? ఆ కంటి మెరుపుల వెనుక మసిమారిపోతున్న..చితికిపోతున్న జీవితాల గురించి తెలుసుకుందాం..
జీవితాలను మసకబారుస్తున్న మేకప్‌ ఫౌండేషన్‌..
మేకప్‌ ఫౌండేషన్‌ గురించి చాలామందికి తెలుసు! కానీ ఆ మెరుపులకు పునాది ఏమిటో మీకు తెలుసా? ఐ షాడో అందాలు చూసి అంతా మురిసిపోతారు. కానీ ఆ వెలుగుల వెనుక పసిపిల్లల అరణ్యరోదన ఎంతమందికి తెలుసు? కాస్మెటిక్‌ జిలుగుల వెనుక కన్నీటి చారికలు ఎంతమంది చూశారు? సౌందర్య సాధనాల్లో వాడే మైకా కోసం బాల్యం సమాధి అవుతున్న వైనం కలచివేస్తున్న వైనం..

మైకా తవ్వకాల్లో సమాధి అయిపోతున్న బాల్యం..
మేకప్‌ ఫౌండేషన్‌ చాటున కన్నీటి వేదన.. మైకా తవ్వకాల్లో బాల్యం సమాధి అయిపోతున్న దుస్థితి. నెలకు 10మంది పిల్లలను మింగుతున్న అక్రమ గనులు.. జార్ఖండ్‌, బీహార్‌లలో 20వేలమంది బాలకార్మికులు పనిచేస్తున్నారు. కాదు కాదు వారి జీవితాలను పణంగా పెడుతున్నారు.

డబ్బు మైకానికి ఛిద్రమైపోతున్న బాల్యం ..
2017 సంవత్సరంలో ఒక్క జూన్‌లోనే ఇరవైమంది పిల్లలు మైకా తవ్వకాల్లో ప్రాణాలు విడిచారని నోబెల్‌ పురస్కార విజేత కైలాస్‌ సత్యార్థి నేతృత్వంలో నడుస్తున్న ‘సేవ్‌ ద చైల్డ్‌హుడ్‌ మూవ్‌మెంట్‌’ రికార్డులు చెబుతున్నాయి. జార్ఖండ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. నెలకు కనీసం పదిమంది పిల్లలు మైకా అక్రమ గనుల్లో సమాధి అవుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. డబ్బు మైకం పట్టిన మైనింగ్‌ కంపెనీలు చిన్నారుల జీవితాలను పణంగా పెడుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జార్ఖండ్ లో 20వేల మంది బాలకార్మికులు..
ఒక్క జార్ఖండ్‌, బిహార్‌లలోనే 20వేలమంది బాలకార్మికులు మైకా గనుల్లో మగ్గిపోతున్నారని ‘సోమో’ అనే డచ్‌ స్వచ్ఛంద సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లోని భిల్వారా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బాలికలు ప్రమాదకర గనుల్లో పనిచేస్తున్నారని వెల్లడించాయి. దేశంలో జరుగుతున్న మైకా మైనింగ్‌లో 70శాతం అక్రమమే అని స్పష్టం చేస్తున్నాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా అక్రమ గనుల్లో మరణిస్తున్నారు. పేదరికంతో మగ్గుతున్న కార్మికులు రోజుకు 150 రూపాయల కోసం.. చీకటి గనుల్లో ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

సహజసిద్ధంగా లభించే మైకా..కృత్రిమ సౌందర్య సాధనాల్లో కీలకపాత్ర..
మేకప్‌ ఫౌండేషన్‌లో మైకా వాడతారు. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే మైకా.. కృత్రిమ సౌందర్య సాధనాల్లో చాలా కీలకమైనది. ఆ అభ్రకం మెరుపుల కోసం కాస్మెటిక్‌ కంపెనీలు ఆరాటపడుతూ ఉంటాయి. ప్రపంచంలో 60శాతం మైకా నిల్వలు భారత్‌లోనే ఉన్నాయి. బిహార్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌లలో మైకా గనులున్నాయి. ఈ గనుల్లో వేలాదిమంది బాల కార్మికులు పనిచేస్తున్నారు. ఐదేళ్లు నిండకుండానే అక్రమ తవ్వకాలకు బలవుతున్నారు. కడుపు నింపుకోవడానికి గనుల్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు. చివరకు ఎంతోమంది చిన్నారులు కూలిలుగానే మరణిస్తున్నారు.

ప్రభుత్వాలను శాంసించే స్థాయికి మైకా మాఫియా..
కాస్మెటిక్స్‌, ఆటోమొబైల్స్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో మైకా వాడకం చాలా ఎక్కువ! ప్రపంచంలోని బడా కంపెనీలు కూడా జార్ఖండ్‌, బీహార్‌లలోని అక్రమ మైనింగ్‌పై ఆధారపడి సౌందర్య సాధనాలను తయారుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలను మైకా మాఫియా శాసించే స్థాయికి ఎదిగింది. బాలకార్మికులు పనిచేసే గనుల నుంచి మైకా సేకరించబోమని బడా కంపెనీలు చెబుతున్నా.. అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అక్రమ మైకా మైనింగ్‌కు చట్టబద్ధత కల్పించే ప్రక్రియను కూడా ప్రభుత్వాలు ఇటీవల మొదలుపెట్టాయి. మైకా అక్రమ గనుల్లో చిన్నారులు సజీవ సమాధి అవుతున్న వాస్తవాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ ఇది ఎప్పటికి సాధ్యమయ్యేను?ఈలోగా ఎంతమంది జీవితాలు సజీవ సమాధులుగా మారిపోయేను? అసలు ఇదంతా జరుగుతుందా? చిన్నారులు వారి బాల్యాన్ని ఆస్వాదించే బంగారు రోజులు వచ్చేనా? అనే ప్రశ్న తలెత్తక మానదు. బాలల దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని గప్పాలు కొట్టే ప్రభుత్వాలు బాలకార్మికులకు ఎటువంటి సమాధానం చెప్పేను? దీనికి చర్యలు తీసుకునే చిత్తశుద్ధి నేటి ప్రభుత్వాలకు వుందా? మసకబారిపోతున్న బాలకార్మికుల జీవితాలకు వెలుగు వచ్చేనా?

Don't Miss