చారిత్రాత్మక చర్చ్ కి క్రిస్మస్ శోభ..

10:28 - December 24, 2016

మెదక్ : ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మెదక్‌ జిల్లాలోని... సీఎస్‌ఐ చర్చ్‌ క్రిస్మస్‌ సంబరాలకు సిద్ధమవుతుంది. ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీస్తు జననంపై నాటకాలు.. బొమ్మల కొలువులు ప్రదర్శించనున్నారు.

క్రిస్మస్‌ వేడుకలకు సిద్ధమవుతున్న మెదక్‌ సీఎస్‌ఐ చర్చ్‌
జిల్లాలో దక్షిణ భారత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న....సీఎస్‌ఐ చర్చ్‌కు ఎంతో చరిత్ర ఉంది. చర్చ్‌ సుమారు వందేళ్ల నాటి కట్టడం. దీనిని చూస్తే అప్పటి నిర్మాణ శైలి ఉట్టిపడుతుంది. 12 వేల మంది కార్మికులు పది సంవత్సరాలు కష్టపడి ఈ చర్చ్‌ను నిర్మించారు. 1914 సంవత్సరంలో ప్రారంభించి 1924లో పూర్తి చేశారు. ఆసియా ఖండంలోనే ఉన్నతమైనదిగా ఈ చర్చ్‌ గుర్తింపు పొందింది. ఈ చర్చ్‌కు 175 అడుగుల ఎత్తున్న శిఖరం ప్రత్యేక ఆకర్షణ.

చర్చ్‌లో 8 లక్షల మంది ప్రార్థనలు చేసుకునే అవకాశం
చర్చ్‌లో ఐదు లక్షల నుంచి 8 లక్షల మంది వరకు ప్రార్థనలు చేసుకునే వీలుంది. మెదక్‌ జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణ ఇండియా మహాదేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరంలో చాలామంది భక్తులు ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. తాగునీటి..భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాహనాల పార్కింగ్‌ కోసం... ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడకుండా కూడా పోలీసుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నారు.

చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
పండుగ సందర్భంగా చర్చ్‌లో క్రీస్తు జన్మవృత్తాంతం గురించి పిల్లలతో పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇక్కడ ఇవ్వనున్నారు. అలాగే ప్రభువుకు సంబంధించిన పలు బొమ్మల కొలువులను ఏర్పాటు చేయనున్నారు. 

Don't Miss