హ్యాపీ క్రిస్మస్...

06:29 - December 25, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సందడి అంబరాన్ని తాకింది. శనివారం రాత్రి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా చర్చిలకు చేరుకుని ప్రార్ధనలో పాల్గొన్నారు. క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి శుభాభినందనలు తెలుపుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్‌ చర్చ్‌లో సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చ్‌లో సందడి మొదలైంది. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అర్థరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోకంలో అవతరించిన సంతోషాన్ని ఆనందోత్సాహాల మధ్య క్రైస్తవ సోదరులు పంచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుండి కూడా మెదక్‌ చర్చ్‌కు పెద్ద ఎత్తున క్రైస్తవులు చేరుకున్నారు.

ఖమ్మం జిల్లాలోని చర్చ్‌లన్నీ రంగు రంగుల కాంతులతో అలంకరించారు. పండుగని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని లక్కెట్టిపేటలోని చర్చ్‌లో కూడా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 85 ఏళ్ల చరిత్ర కల్గిన ఈ చర్చ్‌లో అర్ధరాత్రి నుండే ప్రత్యేక ప్రార్ధనలు చేపడుతున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌, ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌, వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

అటు విజయవాడలో గుణదలమాత చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. గుణదలమాత గాయక బృందం ఆలపించిన క్రిస్మస్ గీతాలు భక్తులను ఆలరించాయి. భక్తులు కొవ్వొత్తులు వెలిగించి గీతాలు ఆలపించారు. ఈ వేడుకలకు బెజవాడ చుట్టు పక్కల ప్రాంతాల నుండి భక్తులు ఆశేష సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంగణం కళకళలాడింది. క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు.

విశాఖలో కూడా చర్చిలన్నీ వారం ముందు నుండే ముస్తాబయ్యాయి. విశాఖలో ఉన్న 18వ శతాబ్దానికి చెందిన సెయింట్‌ పాల్స్‌ చర్చి, భీమీలిలో ఉన్న ఫ్రెంచ్‌ చర్చ్‌ల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. ఒంగోలు లోని పురాతన మైన జ్యూవెట్‌ మెమోరియల్‌ బాపిస్ట్‌ చర్చ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. క్రీస్తుకు సంబంధించిన ప్రదర్శనలు చేపట్టారు. అటు రాజమండ్రి, కాకినాడలో కూడా ప్రత్యేక ప్రార్ధనలు అర్ధరాత్రి నుంచే ప్రారంభించారు. క్రీస్తు జననం సంధర్బంగా చర్చ్‌లోని బిషప్‌లు భక్తులకు శాంతి సందేశాన్ని ఇచ్చారు. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కలిగి శాంతి స్థాపనకు ప్రయత్నించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరుణమయుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు మార్మోగిపోతున్నాయి. 

Don't Miss