హ్యాపీ మెర్రీ క్రిస్మస్..

07:25 - December 25, 2016

హైదరాబాద్ : క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా చర్చిలు విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

అర్థరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు
క్రిస్మస్‌ సందడి అంబరాన్ని అంటుతోంది. క్రైస్తవ దేవాలయాలు విద్యుత్‌ దీపాల కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. చర్చిలను అందంగా అలకరించారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అర్థరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు లోకంలో అవతరించిన సంతోషాన్ని ఆనందోత్సాహాల మధ్య క్రైస్తవ సోదరులు పంచుకుంటున్నారు. క్రిస్మస్ కేక్‌లను కట్ చేసి అందరికీ పంచి పెట్టి హ్యాపీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలను తెలుపుకుంటున్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖులు క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌, ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌, వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

మెదక్ చర్చిలో క్రిస్మస్ శోభ
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది మెదక్‌ చర్చి. ఇది మన రెండు తెలుగురాష్ట్రాలకి తలమానికమని చెప్పవచ్చు. ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా కూడా పేరొందింది. ప్రేమ, శాంతి, మత సామరస్యానికి ప్రతీకగా ఈ చర్చి నిలిచింది. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు జాతర జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల నుంచి ఈ చర్చిని సందర్శించడానికి వస్తున్నారు. చరిత్రాత్మక విశిష్టత కలిగిన ఈ చర్చి క్రిస్మస్‌ పండగ సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది.

విజయవాడలో గుణదలమాత చర్చిలో క్రిస్మస్ సంబరాలు
అటు విజయవాడలో గుణదలమాత చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. విజయవాడ కతోలిక పీఠం మోన్‌సిజ్ఞోర్, పుణ్యక్షేత్రం రెక్టర్ యం.చిన్నప్ప బాలయేసు స్వరూపానికి సాంబ్రాణి ధూపం వేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. గురువులు క్రిస్మస్ కేక్ కట్ చేసి భక్తులకు శుభాకాంక్షలు అందజేశారు. గుణదలమాత గాయక బృందం ఆలపించిన క్రిస్మస్ గీతాలు భక్తులను ఆలరించాయి. భక్తులు క్రొవ్వోత్తులు వెలిగించి బాలయేసు సంబంధించిన గీతాలు ఆలపించారు. ఈ వేడుకలకు జిల్లాతో పాటు, నగరంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు ఆశేష సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరుణమయుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలతో చర్చిలు మార్మోగిపోతున్నాయి.

Don't Miss