కరుణ మృతిపై సినీ పరిశ్రమ దిగ్ర్భాంతి...

21:06 - August 8, 2018

చెన్నై : కరుణానిధి మృతిపై తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు.. కరుణానిధి మృతదేహాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు. సినీ పరిశ్రమతో కరుణానిధికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మృతిపట్ల తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సినీరంగానికి చెందిన ప్రముఖులందరూ.. కలైజ్ఞర్‌ మృతదేహాన్ని సందర్శించి కన్నీరుమున్నీరయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. నటుడు సూర్య ఎదిగే క్రమంలో కరుణానిధి అందించిన ఆశీస్సులను ఆయన తండ్రి, వెటరన్‌ స్టార్‌ జయకుమార్‌ గుర్తు చేసుకున్నారు. కరుణానిధి రచించిన సినిమాలో తాను నటించిన సందర్భాన్ని నటి కాంచన స్మరించుకున్నారు.

తల్లీ తండ్రి లేని అనాథలా ఉన్న తాను.. కరుణానిధిని పెదనాన్నలా భావించానని.. ఇవాళ ఆయన కూడా తనను వదిలి వెళ్లారని శివాజీగణేశన్‌ తనయుడు.. నటుడు ప్రభు వాపోయారు. కరుణానిధిని రాజకీయ నాయకుడిగానే చూడలేమని, తమిళ భాషకు, సాహిత్యానికి ఆయన చేసిన సేవ.. శాశ్వత యశస్సును సముపార్జించిందని నటుడు నాజర్‌ అన్నారు. కరుణానిధికి సమానమైన నాయకుడు, సాహితీవేత్త భవిష్యత్తులో మరెవరూ రారని నటులు వివేక్‌, మన్సూర్‌అలీఖాన్‌ తదితరులు వ్యాఖ్యానించారు. కరుణానిధి మరణం.. తమిళనాడు ప్రజలందరికీ తీరని వేదనను కలిగించిందని నటదర్శకుడు టి.రాజేంద్రన్‌ అన్నారు. తన తండ్రి ఎం.ఆర్‌.రాధాతో కరుణానిధి అనుబంధాన్ని రాధారవి గుర్తు చేసుకున్నారు. కరుణానిధి తమిళ సినీ రంగంపై తనదైన ముద్ర వేశారని.. అది శాశ్వతంగా నిలిచిపోతుందని పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. 

Don't Miss