'ఆది'లో పందెంకోళ్లు..

13:02 - January 7, 2017

ఆదిలాబాద్ : కోడి పందేలకు కోస్తా ప్రాంతం పెట్టింది పేరు. సంక్రాంతి సీజన్‌ వచ్చిందంటే పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగ్‌లు పెడుతారు. కానీ ఇక్కడ మాత్రం సీజన్‌తో సంబంధం లేకుండా కోడి పందేలకు కేరాఫ్‌గా మారుతోంది. కాకులు దూరని కారడవిలో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. సంవత్సరం పొడువునా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి.

తెలంగాణాకు పాకిన కోడిపందేల సంస్కృతి
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రాంతం అది. అడవుల జిల్లాలుగా పేరుగాంచిన వెనుకబడిన ప్రాంతాలు అవి. ఇక్కడ పల్లెల అభివృద్ధి ఊసే ఉండదు. అలాంటి ప్రాంతంలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. కోడి పందేలను, పందెం కోళ్లను సినిమాలో తప్ప నేరుగా చూడని ఈ ప్రాంతంలో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి గ్రామాల్లో కోడి పందేలు జరుగుతున్నాయి.

కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కోడి పందేలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని పది గ్రామాలు, మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలో గోదావరి సరిహద్దు పరివాహక ప్రాంతాల గ్రామాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం, మంగళవారాల్లో కోడి పందేలు సాగుతాయి. గ్రామంలోని యువకులు, పెద్దలు పనులు ఎగొట్టి పందెం కాస్తున్నారు. పండగ సందర్భాల్లో, దసరా, సంక్రాంతి సీజన్లలో పందెం రాయుళ్ల హవా కొనసాగుతుంది. గ్రామాల్లోని యువకులు, పెద్దలు ఇదే పనిగా పందేలకు బానిస కావడంతో సంసారాలు గుల్లవుతున్నాయి. కూలీ డబ్బులు సైతం కోడి పందేల్లో పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు.

సంవత్సరం మొత్తం పందెం కాస్తున్న వైనం
పోలీసులు కోడిపందేల స్థావరాలపై అప్పుడప్పుడు దాడులు చేసి కేసులు పెట్టినా.. ఆ గ్రామాల్లో కోడిపందేల సంస్కృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని గోదావరి నది ప్రాంతంలో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు ఆటోలు, ఆరు బైకులు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.సంక్రాంతి సీజన్‌ నేపథ్యంలో ఈ కోడి పందేల స్థావరాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కోడి పందేలను అడ్డుకొని గ్రామస్తులను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Don't Miss