అధికారులు/నేతల మధ్య కోల్డ్ వార్..

13:21 - January 6, 2017

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమంలో ఐక్య సంఘాలై కలిసి వచ్చిన అధికారులు..ఇప్పుడు అధికార పార్టీ నేతలకే తలనొప్పిగా మారుతున్నారు. అధికారుల ఐక్యత గులాబి పార్టీలో ముళ్లులా గుచ్చుకుంటుండటంతో...సీనియర్ నేతలంతా అసంతృప్తితో రగిలి పోతున్నారు. ఇంతకీ అధికారులు నేతల మాటలు ఎందుకు వినడం లేదు ..?

అధికారులు, నేతల మధ్య లోపించిన సమన్వయం
కరీంనగర్‌ జిల్లా అధికారుల తీరుతో.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనంతో ఉన్నారు. అధికారులతో నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ అభివృద్ధిలో పురోగతి కనిపించక పోవడంతో నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపనీయంగా ఉందని.. స్వయంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులే చెప్పడం పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధరం అవుతోంది. ప్రగతిని పక్కన పెట్టి స్వాహాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నిన్నమొన్నటి వరకు పోస్టింగ్‌ కోసం తమ ఇళ్ల చుట్టూ తిరిగిన అధికారులు.. ఇప్పుడు తమ మాట పెడచెవిన పెడుతున్నారని..సాక్షాత్తు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెల్లడిస్తున్నారు.

ఎమ్మార్వో తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే బొడిగె శోభ
గతంలో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మొదటిసారి ఎమ్మార్వో తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదంటూ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక.. అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు కూడా పిర్యాదు చేశారు. కానీ శోభ పిర్యాదుపై ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఒకానొక దశలో ఎమ్మెల్యే శోభ తీరునే తప్పుపట్టారు.

అధికారులపై సీరియస్‌ అయిన మంథని ఎమ్మెల్యే
ఆ తర్వాత అటవీశాఖ అధికారులు సామాన్యులను వేధిస్తున్నారనే ఆవేదనతో మంథని ఎమ్మెల్యే అధికారులపై సీరియస్‌ అయ్యారు. అప్పట్లో మధు అధికారులను చీవాట్లు పెడుతున్న వీడియో సంచలనం రేపింది. అప్పుడు కూడా మధును తప్పు పడుతూ దూకుడు తగ్గించుకోవాలని సీనియర్‌ నేతలు హెచ్చరించారు. అధికారులు ప్రజాభివృద్ధికి సహకరించడం లేదంటూ మధు సమీక్షా సమావేశాల్లోనూ పలుమార్లు చెప్పినప్పటికీ కనీస స్పందన కరువైంది.

నేతలు, అధికారుల మధ్య సయోధ్య కుదిర్చిన మంత్రి ఈటెల
అధికారుల తీరు పట్ల ఎమ్మెల్యేలు తరచుగా పిర్యాదులు చేయడంతో.. ఆర్థికశాఖ మంత్రి జోక్యం చేసుకుని అధికారులు, నేతల మధ్య రాజీ కుదిర్చి అందరూ కలిసి పనిచేయాలంటూ సూచించారు. జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్‌ నేతలు, అధికారుల మధ్య సయోధ్య కుదర్చడంతో వివాదం సద్దుమణిగింది. కానీ కొన్ని రోజులకే మళ్లీ కథ మొదటికొచ్చింది. ఏకంగా పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌ సమీక్షా సమావేశంలో అప్పటి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌తో పాటు అధికారులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారని, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పద్ధతి మార్చుకోవాలని రెవిన్యూ సమావేశంలో కేసీఆర్ హెచ్చరికలు
జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి ఈటల సైతం అభివృద్ధికి సహకరించాలంటూ.. పలు కార్యక్రమాల్లో అధికారులకు సూచించారు. అయినా.. ఫలితం లేకపోవడంతో.. పద్ధతి మార్చుకోవాలని రెవిన్యూ సమావేశంలో హెచ్చరికలు కూడా చేశారు. కేసీఆర్‌ బంధువు, కరీంనగర్‌ ఎంపీ మాటే చెల్లుబడి అయ్యేలా... రాజకీయంగా అధికారులు తన మాట వినేలా చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై అధికారులు నోరు మెదపాలంటే.. కేసీఆర్‌కు వినోద్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని మిన్నకుండిపోతున్నారు. అయితే.. చివరకు వినోద్‌కు సైతం అధికారులు కొరకరాని కొయ్యలా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చివరకు వినోద్‌ కూడా అధికారుల తీరుపై మండిపడటమే అందుకు నిదర్శనం. ఓవైపు బంగారు తెలంగాణ కోసం పాటు పడుతుంటే.. అధికారులు సహకరించకపోవడం దారుణమని, ఉద్యమస్ఫూర్తితో అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వినోద్‌ సూచించారు.

ఈ కోల్డ్ వార్ తో అభివృద్ధి కుంటుపడుతుందన్న వాదనలు
కరీంనగర్ జిల్లాలోని అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు జరుగుతున్న కోల్డ్ వార్‌తో.. జిల్లాలో అభివృద్ధి కుంటుపడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులను ఐక్యం చేసిన గులాబీ పార్టీ వారి ఐక్యతను సహించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

Don't Miss