ఈటెల వర్సెస్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు..

13:31 - January 2, 2017

కరీంనగర్ : అపుడు రమ్మని ఆహ్వానించారు.. ఇప్పుడు వద్దు పొమ్మంటున్నారు. మంచోడని పిలిచి గద్దెనెక్కిస్తే.. అవినీతి కంపులేపాడని ఆ మంత్రిగారు కస్సుబుస్సులాడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నగర పంచాయతీ ఛైర్మన్‌ వ్యవహారంలో మంత్రి ఈటలపై సొంతపార్టీ నేతలే విమర్శల దాడి పెంచారు. కరీంనగర్‌ జిల్లా హుజారాబాద్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమనడంతో.. గులాబీపార్టీలో రాజకీయం వేడెక్కింది. మంత్రి ఈటల రాజేందర్‌ - టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు వర్గాల మధ్య ఆధిపత్యపోరు గులాబీపార్టీలో చిచ్చుపెడుతోంది. మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

స్థానికుల మండిపాటు..
మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్ల విస్తరణలో ఛైర్మన్‌ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చేస్తున్నారని ఓ వర్గం వారు మండిపడుతున్నారు. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగారి అండచూసుకునే మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ నిధులను సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రి ఈటల చేసిన ప్రయత్నం బెడిసికొడుతోంది. ఛైర్మన్‌తో తమ పార్టీకి సంబంధంలేదని మంత్రి ఈటల తాజాగా పేపర్‌ ప్రకటనలివ్వడం మరింత వివాదస్పదంగా మారింది.

ఈటెలపై వ్యతిరేకత..
హుజూరాబాద్‌ ఛైర్మన్‌గా ఉన్న వడ్లూరి విజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచి.. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే మంత్రి ఈటల రాజేంద్రర్‌ ప్రోత్సాహంతోనే విజయ్‌కుమార్‌ గులాబీపార్టీలోకి వచ్చారని.. స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అంటున్నారు. మురిపెంతో తీసుకొచ్చిన నేత..చివరికి.. మున్సిపాలిటీ నిధులకే ఎసరు పెట్టారనే ఆరోపణలొచ్చాయి. దీంతో ఛైర్మన్‌ వడ్లూరితో తమపార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ.. మంత్రి ఈటల తన బాధ్యతను దులపరించుకుంటున్నారనే హుజూరాబాద్‌ ప్రజలు మండిపడుతున్నారు. మొత్తానికి కోరి తీసుకొచ్చిన మున్సిపల్‌ ఛైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌ వ్యవహారం హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌లో చిచ్చుపెడుతోంది. దీంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు వర్గంతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌ పై విమర్శల దాడి పెంచారు. దీంతో తన సొంత ఇలాఖాలోనే మంత్రి ఈటలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

Don't Miss