రాచకొండ దారుణాలు!!..

12:59 - December 25, 2016

నల్లగొండ : స్నాచర్లు చెలరేగుతూనే ఉన్నారు. ఈవ్‌టీజర్లు హల్‌ చల్‌ చేస్తూనే ఉన్నారు. ప్రాణాలు పోతున్నా అరాచకాలు ఆగడం లేదు. ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. షీటీమ్‌లు ఆకతాయిలపై కొరడా ఝుళిపిస్తున్నా..ఏదో ఓ మూల మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదీ తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ రాచకొండ కమిషనరేట్‌లో పరిస్థితి. ఈ కమిషనరేట్‌ పరిధిలో జరుగుతున్న దారుణాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

రాచకొండ కమిషనరేట్‌లో పెరుగుతున్న క్రైమ్‌రేట్‌
గడిచిన ఏడాదితో పోలిస్తే 2016 ఆడాళ్లలో వణుకుపుట్టించింది..కామాంధుల వికృత క్రీడకు ఎందరో అబలలు బలయ్యారు.. మరెందరో జీవితాలు నాశనమయ్యాయి...అబలలపై అరాచకాలను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే అయ్యాయి... షీ బృందాల ఏర్పాటుతో పోకిరుల్లో భయాన్ని సృష్టించినా... నిర్భయ చట్టాలు మాత్రం కామాంధులను కట్టడి చేయలేకపోయాయి.. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, హత్యాయత్నాలు కలవరం రేపుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాచకొండ కమిషనరేట్‌లో పెరుగుతున్న క్రైమ్‌రేట్‌ గుబులుపుట్టిస్తోంది.

అబలలపై ఆగని అరాచకాలు...పెరిగిన అత్యాచారాలు...
హైదరాబాద్‌ మహానగరంలో సైబరాబాద్ కమిషనరేట్ రెండుగా విడిపోవడం కాస్త ఉపశమనం కలిగించినా..రాచకొండ కమిషనరేట్‌లో జరుగుతున్న నేరాలు, ఘోరాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక కేసుల దర్యాప్తు, రికవరీలో పోలీసులు కొంత వెనకబడిపోయారు. చైన్ స్నాచర్లు స్వైర విహారానికి అడ్డుకట్టపడటం లేదు. గొలుసు దొంగతనాల కేసులు ఛేదించడంలో కాస్త వెనుకపడి ఉన్నామని స్వయంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పడం గమనార్హం.

స్నాచింగ్‌ కేసుల ఛేదింపులో కొంత వెనుకపడ్డమన్న సీపీ
ఇక రాచకొండ కమిషనరేట్‌లో షీటీమ్స్‌ పనితీరుపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. 2244 మంది పోకిరిలపై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. గతేడాది 50 కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా..ఈ ఏడాది 77 ఎఫ్‌ఆర్‌లు రికార్డయ్యాయి. రెండేళ్లలో 127 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. ఈవ్‌టీజర్లలో 24 మంది మైనర్లు ఉండగా..391 మంది 21 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. గతేడాది 302 కేసులు నమోదు కాగా 2016లో 415కు పెరిగాయి. ఇక కమిషనరేట్లో పెరుగుతున్న క్రైమ్‌ రేట్‌ స్థానికులకు దడపుట్టిస్తోంది. రెండు కోట్లు విలువైన గంజాయి పోలీసులకు పట్టుబడటం..కమిషనరేట్‌ పరిధిలో గంజాయి వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. సూడో నక్సలైట్ల పేరుతో అపోలో ఆస్పత్రి యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో సత్వరం స్పందించిన పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులకు సంకెళ్లు వేశారు. మరోవైపు అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, వేధింపుల కేసులు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.

పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, వేధింపుల కేసులు
ఇక హత్య కేసులు ఛేదించడంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. 2015లో 6 హత్య కేసుల్లో ఐదింటిని ఛేదించారు. 2016లో 6 మర్డర్‌ కేసులకు ఆరింటిని ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. రాబరీ కేసులు లాస్ట్‌ ఇయర్‌ 39, ఈ ఏడాది 54కి పెరిగాయి. చైన్ స్నాచింగ్ అండ్ రాబరీ కింద నమోదైన కేసుల్లో.. గతేడాది ఒక్క కేసు నమోదు అయితే ఈ ఏడు 126కు పెరగడం స్నాచర్ల హల్‌చల్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. గత ఏడాది 240 కేసులు నమోదు కాగా పోలీసులు ఛేదించింది 179 మాత్రమే.. ఈ ఏడాది 142కు గాను 70 కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. 2015లో ఇళ్ల చోరీలు 629.. 2016లో 706కు పెరిగాయి. గతేడాది 316 కేసులు రికవరీ చేయగా.. ఈ ఏడు 706 కేసుల్లో కేవలం 360 మాత్రమే రికవరీ చేశారు.2015లో 48 అటెన్షన్ డైవర్షన్ కేసుల్లో 17 మాత్రమే ఛేదించారు. ఈ సంవత్సరం 60 కేసులకు గాను 37 కేసుల్లో పురోగతి సాధించినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు ... ఇక మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి.
ఈ ఏడాది 153 కేసుల్లో 142 ఛేదించి 93% పురోగతి..
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 854 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పలు కేసులు ఛేదించడంలో సహయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. సంజన కేసు సంచలనం సృష్టించింది..మందు బాబుల ర్యాష్‌ డ్రైవింగ్‌కు తల్లీకూతుళ్ల జీవచ్ఛవాలుగా మారిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ ఏడాది 8516 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు బుక్ చేయగా.. పట్ట పగలు మద్యం సేవించి 1151 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఇక ఆన్ లైన్ చీటింగ్ కేసులు ఈ ఏడాది 39 నమోదయ్యాయి. 

Don't Miss