శిక్షలు పెరిగితే నేరాలు తగ్గవు: జస్టిస్ రాజేంద్రన్‌

22:01 - April 28, 2018

హైదరాబాద్ : శిక్షల తీవ్రత పెంచినంత మాత్రాన అత్యాచార నేరాలు తగ్గవని జస్టిస్‌ మంగరీ రాజేంద్రన్‌ అభిప్రాయపడ్డారు. విచారణాధికారులు, కోర్టులు నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే ఈ తరహా నేరాలు అదుపులోకి వస్తాయని అన్నారు.

తెలంగాణ, సూర్యాపేట, మార్కెట్ యార్డ్, రైతులు, ఆందోళన, చర్చ
హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో "వర్కింగ్ ఆఫ్ వుమెన్ లాస్, డెత్ ఫెనాల్టీ రెమీడీస్" అన్న అంశంపై.. చర్చాగోష్ఠి జరిగింది. పొత్తూరి భారతి ఫౌండేషన్‌, ఏపీ పౌరహక్కుల సంఘం సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, మహిళా, శిశు సంక్షేమ అధికారులు, పాత్రికేయులు పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు.. వాటి నియంత్రణకు ఉన్న చట్టాలు.. వాటి ఫలితాలు అన్న అంశంపై ఈ గోష్ఠిలో చర్చించారు. అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించే ఆర్డినెన్స్‌పైనా సమావేశంలో చర్చించారు.

అత్యాచార నిరోధానికి ఎన్నో మార్పులు తేవాలని సూచనలు..
ప్రస్తుత న్యాయ వ్యవస్థలో.. శిక్షలకు, నేరాలకు సంబంధం లేకుండా ఉందని... అందుకే, శిక్షలు విధించడం.. వాటిని అమలు చేయడంలో జాప్యం జరగకుండా చట్టాలు ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అత్యాచార నిరోధానికి ఎన్నో మార్పులు తేవాలని సూచించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ కేసులు మాత్రమే కాదు.. అన్ని చట్టాలూ దుర్వినియోగం అవుతున్నాయని గోష్ఠిలో పాల్గొన్న జస్టిస్‌ రాజేంద్రన్‌ అన్నారు. జస్టిస్‌ లోయా మృతి కేసు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని నిరూపిస్తోందన్నారు. శిక్షలు పెంచితే నేరాలు తగ్గవని, పకడ్బందీ విచారణ, కోర్టుల సత్వర తీర్పులు నేరాలను అదుపులోకి తెస్తాయని జస్టిస్‌ రాజేంద్రన్‌ అభిప్రాయపడ్డారు.

చిన్నారులపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి : లక్ష్మీకుమారి
దేశంలో చిన్నారులపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని, కార్యక్రమంలో పాల్గొన్న మహిళా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా నేరాలను అదుపు చేయడంలో... చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేరగాళ్లకు జరిమానాలు మాత్రమే విధించడం, మరణశిక్షల్లో జాప్యం వంటి కారణాల వల్ల.. నేరస్థులు యథేచ్ఛగా తప్పించుకుంటున్నారని ఆమె అన్నారు. నగరంలో ఇటీవల బాల్యవివాహాలూ పెరుగుతున్నాయని, ప్రభుత్వం భరోసా కేంద్రాలు, షీ-టీమ్‌లను మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో మరిందరు వక్తలు ప్రసంగించారు. నేరగాళ్లకు సత్వరమే శిక్ష పడేలా చట్టాలు ఉండాలని, న్యాయవ్యవస్థ కూడా తీర్పులు సత్వరం అమలయ్యేలా చూడాలని వారు సూచించారు.

 

Don't Miss