ముగిసిన జగ్గారెడ్డి నిరాహార దీక్ష

08:23 - May 31, 2018

సంగారెడ్డి : జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న డిమాండులో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జంగ్గారెడ్డి  మూడు రోజుల పాటు చేసిన నిరాహార దీక్ష ముగిసింది. నిరసన దీక్ష ముగిసినా.. మెడికల్‌ కాలేజీ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ ఇవ్వకపోతే... 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇస్తుందని.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని దీక్ష 
జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన మూడు రోజుల దీక్ష ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జగ్గారెడ్డి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. చివరి రోజు దీక్ష ముగింపు కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. 
సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ ఇవ్వాలి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి పెంచి మెడికల్‌ కాలేజీగా మార్పుచేస్తే సరిపోతుందని  తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. సంగారెడ్డికి మంజూరు చేసిన మెడికల్‌ కాలేజీని మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటకు తరలించుకుపోయారన్నది జగ్గారెడ్డి వాదన. సూర్యాపేటకు కొత్తగా మెడికల్‌ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సంగారెడ్డికి ఎందుకు ఇవ్వరని టీపీసీసీ నాయకులు ప్రశ్నించారు. సంగారెడ్డికి వెంటనే మెడికల్‌ కాలేజీ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేకపోతే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. 
పోరాటం కొనసాగుతుందన్న జగ్గారెడ్డి  
దీక్ష విరమించినా... ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సంగారెడ్డికి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అవసరమని జగ్గారెడ్డి దీక్ష ముగింపు కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. 
 

Don't Miss