24 గంటల మంటలు...

21:05 - January 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ‌లో పవర్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. క‌రెంట్‌ అంశం కాంగ్రెస్ -టీఆర్ఎస్‌ల‌ మ‌ధ్య మంట‌లు పుట్టిస్తోంది. విద్యుత్ కొనుగోలులో అవినితీ ఉంద‌న్న కాంగ్రెస్‌ కామెంట్స్‌తో ఇరు పార్టీల‌ మ‌ధ్య డైలాగ్ వార్‌ కొనసాగుతోంది. బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అంటుంటే.. విశ్వసనీయత లేని వారితో మాటలేంటని టీఆర్‌ఎస్‌ వాదిస్తోంది.

తెలంగాణలో నిరంతర విద్యుత్‌ సరఫరా అంశం కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. విద్యుత్‌ కొనుగోళ్లలో.. ప్లాంట్స్‌ ఏర్పాటులో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఏపీలో చౌక‌గా విద్యుత్ ఇస్తామ‌ని చెప్పినా ప‌ట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్ళు ఎలా చేస్తార‌ని ఆయ‌న ప్రశ్నించారు. విద్యుత్‌ అక్రమాలపై ఎక్కడ బహిరంగ చర్చ నిర్వహించినా వస్తానంటూ సవాల్‌ విసిరారు.

రేవంత్‌ ఆరోప‌ణ‌ల‌పై తొలుత టీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ కౌంట‌రే ఇచ్చింది. ప్రభుత్వం రైతుల‌కు 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తుంటే .. ఓర్వలేని కాంగ్రెస్ త‌మ స‌ర్కారుపై దుష్ప్రచారానికి దిగుతుంద‌ని గులాబీ నేత‌లు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్తవ‌మ‌ని .. దీనిపై బ‌హిరంగ చ‌ర్చకు సిద్ధమ‌ని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ ప్రకటించారు.

విద్యుత్‌ పాలసీలో ప్రభుత్వ అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోలార్ విద్యుత్ టెండ‌ర్ల ద‌గ్గరి నుంచి .. యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్స్‌, బీహెచ్‌ఈఎల్ విద్యుత్ ఒప్పందాల‌న్నింటిలో క‌మీష‌న్ల క‌క్కుర్తి దాగిఉంద‌ని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే .. బ‌హిరంగ చ‌ర్చకు రావాలని.. తాను ప్రభుత్వం అవినితిని నిరుపించ‌లేక పోతే.. త‌న‌ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా అంటూ స‌వాల్ విసిరారు.

కాంగ్రెస్‌ నుంచి అదే స్పీడులో సమాధానాలు వస్తుండటంతో... గులాబీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. సవాల్‌కు వెనకడుగు వేసేది లేదంటూనే.. కొత్తమెలిక పెట్టారు. రేవంత్‌రెడ్డి లాంటి విశ్వసనీయతలేని వ్యక్తితో చర్చించలేమని.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి లాంటి కీలక నేతలు వస్తే తాము చర్చలకు వస్తామని కొత్త రాగం అందుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో పవర్‌ వార్‌ కొనసాగుతోంది. 

Don't Miss