కేసీఆర్ ది తుగ్లక్ పాలన

21:47 - September 6, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త సచివాలయం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న కేసీఆర్ ప్రతిపాదనలతో కాంగ్రెస్ నేతలు మళ్లీ ఆందోళన బాట పట్టారు. బైసన్ పోలో గ్రౌండ్ ముందు ధర్నా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ష‌బ్బీర్ ఆలీ, వీహెచ్‌ కార్యకర్తలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.

నిర్మాణాన్ని అడ్డుకుంటాము
బైసన్‌పోలో గ్రౌండ్‌లోకి సచివాలయాన్ని మార్చాలనుకోవడం కేసీఆర్ తుగ్లక్ చర్య అని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. వీహెచ్ కొత్త సచివాలయంపై అటువైపు వెళ్తున్న వాహనదారుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వాస్తు కోసం ప్రజాధనం వృథా చేస్తున్నారని వారికి వివరించారు. కేసీఆర్ రాజులా విలాసాలతో పాలన సాగిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయ నిర్మాణం చేపడితే అడ్డుకుంటామంటున్నారు కాంగ్రెస్ నేతలు. అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకుని ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

Don't Miss