11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

21:50 - March 13, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఘటనకు బాధ్యులైన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆరుగురు ఎమ్మెల్సీలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అలాగే మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్‌ విసిరి గాయపర్చారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌‌ల శాసనసభ సభ్యత్వాలను స్పీకర్‌ రద్దు చేశారు. మరోవైపు ప్రభుత్వ చర్యను కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. సభలో ప్రతిపక్షాలు ఉండొద్దనే సస్పెన్షన్‌ చేశారని మండిపడింది. దీనిపై న్యాయసలహా తీసుకుంటామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.  
11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌..
శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై సోమవారం అసెంబ్లీలో జరిగిన దాడిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను శాసనసభాపతి మధుసూదనాచారి సస్పెండ్‌ చేశారు. జానారెడ్డితోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాదవరెడ్డి, వంశీచంద్‌రెడ్డిపై సస్పెన్షన్‌వేటు వేశారు. ఈ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ బహిష్కరణ ఉంటుందని స్పీకర్‌ ప్రకటించారు.
కోమటిరెడ్డి, సంపత్‌ సభ్యత్వాలు రద్దు 
అలాగే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభా సభ్యత్వాలను రద్దు చేశారు. సభలో దాడిపై స్పీకర్ మధుసూదనాచారి విచారం వ్యక్తం చేశారు. శాసనవ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ సభ్యుల చర్యలను తీవ్రంగా ఖండించారు. 11 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌, మరో ఇద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ హరీష్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానానికి స్పీకర్ మధుసూదనాచారి ఆమోదం తెలిపారు.
శాసనమండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యుల సస్పెండ్‌ 
అటు శాసన మండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేశారు. షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆకుల లలిత, సంతోష్‌, దామోదర్‌రెడ్డిపై వేటు వేస్తూ డిఫ్యూటీ చైర్మన్‌ నేతివిద్యాసాగర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్‌ ముగిసే వరకూ వీరిపై సస్పెన్షన్‌ కొనసాగుతుందన్నారు.
అరాచకాలు సృష్టిస్తామంటే సహించేది లేదన్న సీఎం కేసీఆర్‌ 
సభలో అరాచకాలు సృష్టిస్తామంటే సహించేది లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అది ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్‌ సభ్యులపై వేటు వేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఈ విషయంలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ కిషన్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ మధ్య వాడీవేడి సంవాదం నడిచింది. జానారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు ఎలా వేశారని కిషన్‌రెడ్డి ప్రశ్నించగా..  కాంగ్రెస్‌ సభ్యుల్లో అసహనం పెరిగిపోయిందని సీఎం ఆగ్రహించారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందికాదని బీజేపీ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచింది. పార్లమెంట్‌లోనూ విపక్షాలు నిరసన తెలుపుతున్నాయని.. అక్కడ వారిని సస్పెండ్‌ చేయడం లేదని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. 
టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ మద్దతు 
అటు టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలను మజ్లిస్‌ సమర్థిస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ చెప్పారు. 
ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన కాంగ్రెస్‌  
మరోవైపు ప్రభుత్వ చర్యలను కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై కాంగ్రెస్‌ సభ్యులు దాడి చేశారనడంలో నిజం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని కావాలనే అసెంబ్లీ నుంచి గెంటేశారని ఆరోపించారు. స్పీకర్‌ తమ వాదన వినకుండానే సస్పెన్షన్ వేటు వేయడం దారుణమన్నారు. గతంలో హరీశ్‌రావు శాసనసభలో ప్రవర్తించిన తీరును కేసీఆర్‌ మరిచిపోయారా అని ప్రశ్నించారు. 
నాపై ఎందుకు వేటు వేశారన్న జానారెడ్డి 
సభలో జరిగిన ఘటనతో ఏ సంబంధం లేని తనపై ఎందుకు వేటు వేశారని విపక్షనేత జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తోందని మండిపడ్డారు. బడ్జెట్‌లో లోపాలను ఎత్తి చూపుతామన్న ఆందోళనతోనే ముందుగానే తమను సభ నుంచి గెంటేశారని ఆరోపించారు. 
కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలు సరైనదే : మంత్రి జగదీష్‌రెడ్డి 
కాంగ్రెస్‌ సభ్యులపై చర్యలు సరైనదేనని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. దాడి చేసిన సభ్యులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టే అధికారం స్పీకర్‌కు ఉంటుందని ఆయన మీడియాపాయింట్‌లో తెలిపారు. కాంగ్రెస్‌ ముఠాకు నాయకత్వం వహించింది జానారెడ్డి అని అందుకే ఆయనపై వేటు పడిందన్నారు. దాడి చేసి టెర్రరిస్టులు ఆనందపడ్డట్లు కాంగ్రెస్‌ సభ్యులు ఆనందపడ్డారని జగదీష్‌రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ తీరుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఖండన
ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని.. అంతమాత్రాన్నే సస్పెండ్‌ చేస్తారా అని ప్రశ్నించారు. విపక్షాలను బెదిరించడమే లక్ష్యంగా ప్రభుత్వం తమపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు.
కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై ఈసీకి నివేదిక ? 
కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై నివేదికను.. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ అసెంబ్లీ పంపేందుకు సిద్ధమవుతోంది. ఈసీ అంగీకారం లభిస్తే... కర్ణాటకతో పాటు ఆ రెండు ఎమ్మెల్యే స్థానాలకు.. ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అనర్హత వేటును నిరసిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ గాంధీభవన్‌లో 48 గంటల దీక్షకు దిగారు. అలాగే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామన్నారు.

 

Don't Miss