కాంగ్రెస్ దీక్షాస్త్రం...

21:57 - March 13, 2018

హైదరాబాద్ : అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలపై వేటు అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచుకునేందుకు.. కాంగ్రెస్ పార్టీ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. గాంధీభ‌వ‌న్ వేదిక‌గా నిర‌హార దీక్షతో గులాబీ స‌ర్కారుపై సమరభేరి మోగించాలని హస్తం నేతలు నిర్ణయించారు. కేసీఆర్ నియంతృత్వ పోక‌డ‌పై ఇక స‌మ‌ర‌మే అంటున్న కాంగ్రెస్‌ నేత‌లు .. ప్రజల్లోకి వెళ్లడం.. కోర్టు మెట్లెక్కడం ద్వారా కూడా... గులాబీ బాస్‌పై ఒత్తిడిని పెంచాలని భావిస్తున్నారు. 

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం రోజున..  కాంగ్రెస్ శాస‌న స‌భాప‌క్షం దూకుడు .. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ సభనుంచి స‌స్పెండ్‌ చేసేదాకా వెళ్ళింది. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఏకంగా సభ్యత్వాన్నే కోల్పోయారు. ప్రభుత్వ చర్యపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి అప్రజాస్వామిక వైఖరికి పాల్పడిందని కాంగ్రెస్‌ నాయకులు దుయ్యబడుతున్నారు. 

తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసిన అంశాన్ని రాజకీయాస్త్రంగా మలచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్‌ నాయకత్వం.. ఇప్పుడు 48 గంటల దీక్ష చేపట్టారు. శాసనసభ్యత్వాన్ని కోల్పోయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంటకరెడ్డి, సంపత్‌లు.. గాంధీభవన్‌ వేదికగా ఈ దీక్షలో ప్రధానంగా పాల్గొంటున్నారు.
 
తమ ఎమ్మెల్యేలను ఏకపక్షంగా సస్పెండ్‌ చేశారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌ నాయకత్వం.. ప్రభుత్వ వైఖరిపై కోర్టును ఆశ్రయించడం.. తెలంగాణ వీధివీధినా ప్రభుత్వాన్ని నిలదీయడం.. లాంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. 

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, ప్రాజెక్టుల రీ డిజైన్స్‌ పేరిట వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని, దీన్ని నిలదీస్తామన్న వణుకుతోనే ప్రభుత్వం తమను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేసిందని, స్పీకర్‌ కూడా పక్షపాతంగా వ్యవహరించారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. 

సభ నుంచి గెంటేసినా.. ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో నిలదీసేందుకు కాంగ్రెస్‌ తెలంగాణ నాయకత్వం సిద్ధమవుతోంది. దీంతోపాటే.. రాష్ట్రంలో అధికార పక్షం వైఖరిపై రాష్ట్రప‌తికి  ఫిర్యాదు చేయాలని కూడా యోచిస్తోంది. 

Don't Miss