రాహుల్‌ తెలంగాణ టూర్‌

11:24 - August 10, 2018

హైదరాబాద్ : రాహుల్‌ పర్యటనకు.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాహుల్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకొచ్చి.. తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి రగిలించే సన్నాహాలు చేస్తోంది. రాహుల్‌ రెండు రోజుల టూర్‌.. నిరుద్యోగ, మహిళ, ముస్లిం, సెటిలర్స్‌ ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా రాహుల్‌ టూర్‌ సాగనుంది.
ఈనెల 13, 14 తేదీల్లో రాహుల్‌ టూర్‌
ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. రాహుల్‌గాంధీ తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో రెండు రోజులూ.. రాహుల్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే పర్యటించనున్నారు. శంషాబాద్‌లో దిగింది మొదలు.. హస్తిన తిరుగుపయనమయ్యే వరకూ.. ఊపిరి సలపని రీతిలో రాహుల్‌ కార్యక్రమాల షెడ్యూల్‌ను టీపీసీసీ రూపొందించింది.     
హైదరాబాద్‌లో రెండురోజులూ రాహుల్‌ పర్యటన       
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఓ స్ట్రాటజీ మేరకే ... రాహుల్‌ను రెండురోజులూ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే పర్యటింప చేస్తోందని పార్టీ వర్గాల విశ్లేషణ. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో.. కాంగ్రెస్‌ పార్టీకి అంత బలం లేదు. పైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి లగాయితు.. కాంగ్రెస్‌ కేడర్‌ నైరాశ్యంలో కూరుకుపోయింది. ఈ మధ్యనే అంజన్‌కుమార్‌ను సిటీ అధ్యక్షుడిగా నియమించాక.. పార్టీ కార్యక్రమాల్లో కాస్తంత దూకుడు కనిపిస్తోంది. ఇప్పుడు రాహుల్‌ను గ్రేటర్‌లో తిప్పితే.. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ వస్తుందని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. 
ఓట్ల వేటగానే రాహుల్‌ పర్యటన
రాహుల్‌ పర్యటనను.. టీపీసీసీ అచ్చంగా ఓట్లవేటగానే మలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో అధికారం పక్కా అని హస్తంపార్టీ భావిస్తోంది. అందుకే.. ఇక్కడి మహిళలు, ముస్లింలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పారిశ్రామిక వేత్తలతో రాహుల్‌ భేటీకి సన్నాహాలు చేస్తోంది. వివిధ వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ గతంలో చేసిన మేళ్లు.. ప్రస్తుత కేసీఆర్‌ సర్కారు నిర్లక్ష్యాలను రాహుల్‌ ద్వారా ఎత్తి చూపాలని టీపీసీసీ నిర్ణయించింది.
హైదరాబాద్‌ సెటిలర్స్‌పై కాంగ్రెస్‌ కన్ను
హైదరాబాద్‌లో సెటిలర్స్‌ సంఖ్య కూడా బాగా ఎక్కువే. వీరి మద్దతును కూడగడితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీగా లాభం చేకూరుతుందని హస్తం నేతలు నమ్ముతున్నారు. అందుకే శేరిలింగంపల్లి వేదికగా.. సెటిలర్స్‌కు రాహుల్‌ద్వారా భరోసా ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణలో వారి రక్షణకు తీసుకోనున్న చర్యలపై రాహుల్‌తో ప్రకటన చేయించాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది. అదేవిధంగా.. ముస్లింల రిజర్వేషన్‌ల అంశంపైనా.. కేసీఆర్‌, మోదీల వైఖరిని ఎండగడుతూ.. తమ మద్దతును స్పష్టం చేయాలని చూస్తున్నారు.
వ్యూహాత్మకంగానే రాహుల్‌ ఓయూ పర్యటన
రాహుల్‌ పర్యటనలో తెలంగాణ సెంటిమెంట్‌నూ రగిలించే ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం చేస్తోంది. ఉద్యమానికి ఊపిరులు పోసిన ఉస్మానియా వర్సిటీలో రాహుల్‌ ప్లాన్‌ వెనుక ఉద్దేశం ఇదేనని చెబుతున్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై.. కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ.. విద్యార్థులు, యువతకు దగ్గర కావాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా తెలుస్తోంది.  ఎవరైనా రాహుల్‌ టూర్‌ను అడ్డుకున్నా.. దాన్నీ రాజకీయంగా వినియోగించుకునేలా టీపీసీసీ నాయకత్వం ప్రణాళికతో ఉన్నట్లు చెబుతున్నారు. 
150 మంది పారిశ్రామిక వేత్తలతో రాహుల్‌ భేటీ 
రాహుల్‌ తొలిసారిగా 150 మంది స్థానిక పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేకంగా భేటీ కానుండడం కూడా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడం.. ఇతరుల ఓటు బ్యాంకును కొల్లగొట్టడం.. తద్వారా అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా రాహుల్‌ టూర్‌ను ప్లాన్‌ చేసిన కాంగ్రెస్‌ నాయకుల ఆశయం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. 

Don't Miss