డ్యామిట్ కథ అడ్డం తిరిగింది

07:21 - August 2, 2017

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన విక్రమ్‌గౌడ్‌ కాల్పుల కేసులో మిస్టరీ వీడింది. విక్రమ్‌గౌడే ప్రధాన సూత్రదారి అని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఆరుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అనంతపురం నుంచి ఇప్పటికే హైదరాబాద్‌కు తరలించారు. నిందితులను విచారించిన పోలీసులు. శుక్రవారం తెల్లవారు జామున తనపై ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారని విక్రమ్‌గౌడ్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అయితే... ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. కావాలనే మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పుల బాధను తప్పించుకోవడానికే కాల్పుల నాటకం ఆడినట్లు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆరుగురు వ్యక్తులను తనే పురమాయించి ఉంటాడని అనుమానించారు. తనపై కాల్పులు జరపాలని అనంతపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు.. హైదరాబాద్‌కు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చాడు. పక్కా పథకం ప్రకారమే కాల్పులకు ప్లాన్‌ చేశాడు. తొలుత బంజారాహిల్స్‌లోని తన కార్యాలయం 'క్లాప్‌షార్ట్‌'లో కాల్చుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే... అక్కడే ఒక్కడే వాచ్‌మెన్‌ ఉండడంతో పాటు... రాత్రి ఒంటిగంటన్నర కావస్తుండడంతో తనకు సీరియస్‌ అయితే ఎవరూ ఆస్పత్రికి తీసుకువెళ్లరనే అనుమానంతో ప్లాన్‌ను ఇంటికి మార్చినట్లు తెలుస్తోంది.

స్వయంగా రెండువైపులా కాల్చుకుని
ఇక ఇంటికి వచ్చిన విక్రమ్‌ సుపారీ ఇచ్చినవారితో కాల్పించుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వాచ్‌మెన్‌ను గేట్‌ వేయవద్దని చెప్పాడు. అయితే కాల్చే సమయంలో వారి గురి తప్పితే ప్రాణాలకు ప్రమాదముందని భయపడిన విక్రమ్‌ తానే స్వయంగా రెండువైపులా కాల్చుకుని... గన్‌ను వారికిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు విక్రమ్‌ గేమ్‌ ఆడుతున్నాడని గుర్తించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి అన్ని వివరాలు సేకరించారు. కాల్పులకు ఉపయోగించిన గన్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

 

Don't Miss