రసాభాసగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ

08:07 - August 24, 2017

పెద్దపల్లి : జిల్లాలోని కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడికి దిగడంతో గందరగోళం నెలకొంది. కుర్చీలు విసిరేస్తూ.. ముష్టిఘాతాలతో ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ కాస్తా.. రణరంగంగా మారింది. 
ప్రజాభిప్రాయ సభలో ప్రజల వ్యతిరేకత 
కాళేశ్వరం ప్రాజెక్టులపై చేపట్టిన ప్రజాభిప్రాయ సభలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్దపల్లిజిల్లా కేంద్రంలో జరిగిన సభ పార్టీల యుద్ధంగా మారింది. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కుర్చీలు విసురుకుని చితకబాదుకున్నారు. పెద్దపల్లిలోని రాఘవరెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు, కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. కలెక్టర్‌ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభించిన అభిప్రాయ సేకరణ సభకు పలువురు అధికారులు హాజరయ్యారు. మంథని ప్రాంతంలో జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణసభను పెద్దపల్లిలో ఎందుకు ఏర్పాటు చేశారని భూ నిర్వాసితులు అధికారులను నిలదీశారు. పైగా ఇప్పటికే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. పరిహారం విషయంలో నోరుమెదపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించాలని కోరిన రైతులపై పోలీసులతో దాడులు చేయించి.. మళ్లీ ఏమి జరగనట్టే ప్రజాభిప్రాయం ఎందుకుపెట్టారని నిగ్గదీశారు. 
పరిహారం కోసం రైతులు, ప్రజలు నిలదీత 
పరిహారం కోసం రైతులు, ప్రజలు నిలదీస్తుంటే.. అధికారులు సమాధానం చెప్పలేక ఇబ్బందిపడ్డారు. దీంతో సభలోనే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఒక్కసారిగా గొడవకు దిగారు. నిర్వాసితుల తరపున మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులపై దూసుకొచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీఆర్‌ఎస్‌ కార్యర్తల దాడిలో పలువురు కాంగ్రెస్‌ నేతలు గాయపడ్డారు.  కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
పర్యావరణ అనుమతులు లేకండానే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
పర్యావరణ అనుమతులు లేకండానే  కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టారని భూ నిర్వాసితులు వాపోతున్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా పనులు ప్రారంభించి.. తీరా ఇబ్బందులు చెబుతుంటే పోలీసులతో బెదిరిస్తూ.. దాడులకు దిగుతున్నారని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

Don't Miss