మొక్కజొన్న పొత్తులు.. ఆరోగ్య రహస్యాలు..

11:58 - July 11, 2017

సన్నని చినుకులు పడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరంలో తినేందుకు ఎంతో రుచిక‌రంగా ఉండే మొక్క‌జొన్న అంటే దాదాపుగా అంద‌రికీ ఇష్ట‌మే. ఉడ‌క‌బెట్టినా, నిప్పుల‌పై కాల్చుకుని తిన్నా మొక్కజొన్న రుచే వేరబ్బా.. ఈ సీజ‌న్‌లో మొక్క‌జొన్న ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే మొక్కజొన్న‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలో తెలుసుకుందా..

 

మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకా పాంటోథెనిక్‌ ఆమ్లం జీవక్రియకు దోహదపడుతుంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్‌ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువే. ఇ-విటమిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

మొక్క‌జొన్న‌లో విట‌మిన్ సి, బ‌యో ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ర‌క్తంలో ఎక్కువ‌గా ఉన్న కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. దీనివ‌ల్ల గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

కీళ‌నొప్పులతో బాధ ప‌డేవారు మొక్క‌జొన్న‌ల‌ను త‌మ ఆహారంలో భాగం చేసుకుంటే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. బీటా కెరోటిన్‌, విట‌మిన్- ఎ లు ఉండ‌డం వ‌ల్ల మొక్క‌జొన్న‌ల‌తో కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది. దృష్టి సంబంధ స‌మస్య‌లు తొల‌గిపోతాయి. పీచు, కార్బొహైడ్రేట్లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మొక్క‌జొన్న‌ల‌తో శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండ‌వ‌చ్చు. మొక్క‌జొన్న‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతోపాటు ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి ఉప‌యోగ‌ప‌డే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్క‌జొన్న‌ల్లో అధికంగానే ఉంటుంది.

ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల మొక్క జొన్న గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వారి క‌డుపులోని బిడ్డ‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం. కాబ‌ట్టి మొక్క‌జొన్న‌ల‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు.

మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్ఫరస్‌ మూత్రపిండాల పనితీరుకి తోడ్పడితే, మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది.

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. ఫెరూలిక్‌ ఆమ్లం క్యాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తూ రొమ్ము, కాలేయ క్యాన్సర్లతో పోరాడుతుంది. వూదారంగు మొక్కజొన్నల్లోని ఆంతోసైనిన్‌లు సైతం క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటాయి. ఆల్జీమర్స్‌, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ నివారిస్తాయని తాజా పరిశోధనలూ చెబుతున్నాయి. మిగిలిన ఆహారపదార్థాలకు భిన్నంగా ఉడికించడంవల్ల స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది.

మొక్కజొన్నల నుంచి తీసిన నూనెలో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులూ స్టెరాల్స్‌ ఎక్కువగా ఉండటంవల్ల అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడతాయట. రక్తనాళాల్లో పాచి పేరుకోకుండా చేయడంద్వారా గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి. బీపీనీ తగ్గిస్తాయట.

మొక్కజొన్నలోని ఫైటోకెమికల్స్‌ శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుంది. చూశారుగా... మనం సరదాగా కాలక్షేపంకోసం తినే రుచికరమైన మొక్కజొన్నలో ఎంత ఆరోగ్యం దాగుందో... అయితే తియ్యదనంకోసం మొక్కజొన్న నుంచి తీసిన కార్న్‌ సిరప్‌ను ప్రాసెస్‌డ్‌ ఆహారపదార్థాలూ శీతలపానీయాల్లో విరివిగా వాడుతుంటారు. ఈ సిరప్‌లో ఫ్రక్టోజ్‌ శాతం ఎక్కువ. అది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. కాబట్టి వాటితో మాత్రం కాస్త జాగ్రత్త!

 

Don't Miss