సీఎం దత్తాత గ్రామంలో అవినీతి

18:53 - September 9, 2017

విశాఖ : విశాఖ జిల్లా ఏపీలో గిరిజనులు అత్యధికంగా కలిగిన జిల్లాల్లో ఒకటి. గిరిజనులకు కూడా అభివృద్ధి ఫలాలు అందించాలన్న లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు అరకు నియోజకవర్గంలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నారు. ఇక్కడ ఇటీవలే అంతర్జాతీయ గిరిజన ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించారు. అయితే పెదలబుడు పంచాయతీ పరిధిలోని 20 గ్రామాల్లో స్వచ్ఛ భారత్‌ కింద ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు 20 గ్రామాల్లో దాదాపు 1151 మరుగుదొడ్లను గిరిజనులు తమ సొంత డబ్బుతో నిర్మించుకున్నారు. దాదాపు కోటి 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వానికి బిల్లులు కూడా పెట్టుకున్నారు. డబ్బులు కూడా అధికారులు మంజూరు చేశారు. కానీ ఆ డబ్బులు గిరిజనుల అకౌంట్లలోకి రాలేదు. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వం 15వేల చొప్పున మొత్తం 1151 మరుగుదొడ్ల కోసం కోటి 75 లక్షలు రూపాయలు మంజూరు చేసింది.

కాంట్రాక్టర్ల ఖాతాలోకి లబ్ది డబ్బులు
ఆ డబ్బులు లబ్ది దారుల ఖాతాల్లోకి వెళ్లకుండా కాంట్రాక్టర్లు స్కెచ్‌ వేశారు. ఆ డబ్బునంతా తమ బంధువుల అకౌంట్లలోకి వెళ్లిపోయాయి. పెదలబుడు మాజీ ఎంపీటీసీ శెట్టి వెంకటరావు, గుమ్య సన్యాసిరావు, గుమ్మ శివకృష్ణ, ఎస్‌. కనకరాజు ఖాతాల్లోకి వెళ్లాయి. శెట్టి వెంకటరావు ఖాతాలోకి 28 లక్షల 70వేల రూపాయలు, కే. రవిరాజు కుమార్‌ ఖాతాలోకి 13 లక్షల 30వేలు, పెదలబుడు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దీనబందు అకౌంట్‌లోకి లక్ష 83వేలు, వంతాల గంగులు ఖాతాలోకి మరో 5లక్షల 60వేల రూపాయలు పడ్డాయి. వరకోటి కొండమ్మ అనే మహిళ ఖాతాలోకి 2 లక్షల 63వేల రూపాయలు, సన్యాసిరావు అకౌంట్లో 6లక్షల 34వేలు, శివకృష్ణ ఖాతాలో 6లక్షల 26వేలు, వంపూరు గంగాధర్‌ ఖాతాలో 11లక్షల 13వేలు, సుంకరమెట్ట అభిరాం ఖాతాలోకి మరో ఏడున్నర లక్షలు జమ అయ్యాయి.

సీపీఎం నేతలు కూపీ లాగగా
గిరిజనులు కట్టుకున్న మరుగుదొడ్ల బిల్లులన్నీ 2016 మార్చినాటికే అక్రమార్కుల ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. 2017 మార్చిలో జరిగిన సామాజిక తనిఖీలోనూ ఈ అవినీతి బాగోతం బయటపడకుండా అక్రమార్కులు జాగ్రత్తపడ్డారు. ఎక్కడా ఎలాంటి సర్వే నిర్వహించని అధికారులు..పైగా అన్ని సక్రమంగా ఉన్నట్టు నివేదికలు పంపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీపీఎం నేతలు కూపీ లాగగా అవినీతి బండారం బయటపడింది. గిరిజనులకు చెందిన డబ్బులు కాంట్రాక్టర్లు కాజేయడంపై సీపీఎం నేతలు మండిపడుతున్నారు. అధికారులను నిలదీశారు. ఫలితంగా కొంతమంది కాంట్రాక్టర్లు గిరిజనులకు తమ ఎకౌంట్లలో పడ్డ డబ్బులను ఇచ్చివేశారు. దీంతో మేల్కొన్న అధికారులు గిరిజనుల డబ్బులు కాజేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి సీఎం దత్తత గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా గ్రామాల్లో అవినీతి ఎలా జరుగుతుందో ఊహించవచ్చు. పారదర్శక పాలన అని ఊదరగొడుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

Don't Miss