కళ్యాణలక్ష్మి, షాది ముబారాక్‌ పథకాల్లో అవినీతి

15:19 - August 29, 2017

సిరిసిల్ల : పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు కొంతమంది దండుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రం తప్పనిసరి కావడంతో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. అసలు ఫీజు కంటే అధిక మొత్తం వసూలు చేస్తూ దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే... పత్రాలు సరిగాలేవని తిరస్కరిస్తున్నారు. దీంతో అడిగిన మొత్తం ఇచ్చి పత్రాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిర్వాకమంతా మంత్రి కేటీఆర్‌ ఇలాఖాలోని రాజన్న సిరిసిల్లలోనే జరగడం విశేషం. 
వివాహ సర్టిఫికేట్ల కోసం అధిక డబ్బు వసూలు 
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములోని సబ్‌ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోని కొంతమంది సిబ్బందికి  కళ్యాణలక్ష్మి, షాది ముభారాక్  పథకాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రభుత్వం పేద వర్గాల కోసం తలపెట్టిన ఈ పథకాలు వారికి లాభాల పంటగా మారింది. అట్టడుగు వర్గాల వారికి కొండంత అండగా ఉంటుందని ప్రభుత్వం.. వారిని ఆదుకునేందుకు డెబ్భై ఐదు  వేల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. అయితే వీటిని అందుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు లో వివాహం జరిగినట్టు ధ్రువ పత్రం అవసరం. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది ఉద్యోగులు వచ్చిన వారి దగ్గరి నుండి దండుకోవడం మొదలు పెట్టారు. అడిగినంత ఇచ్చుకోలేని వారిని పత్రాలు సరిగా లేవంటూ తిప్పిపంపడం సర్వ సాధారణంగా మారింది. 
రూ.200 బదులుగా రూ.500 వసూలు 
సాధారణముగా వివాహ ధ్రువ పత్రం తీసుకోవాలంటే రెండు వందల రూపాయలు కట్టి, రశీదుతో పాటుగా, వివాహ ధ్రువ పత్రం పొందడం ఎక్కడైనా బాధితులకు ఆనావాయితి. కాని సిరిసిల్ల పట్టణం లోని సబ్‌ రిజిస్టార్ ఆఫీసులో మాత్రం ఐదు వందల రూపాయలు ఇస్తేనే వివాహ ధ్రువ పత్రం చేతికి అందుతుంది. కాని ఇచ్చిన  డబ్బులకు రశీదు ఇవ్వరు. సుమారు రోజుకు పది నుండి పన్నెండు వరకు ఈ కార్యాలయానికి వివాహ ధ్రువ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేందుకు లబ్ది దారులు  వస్తుంటారు. ఈ లెక్కన ప్రతి రోజు వీరి పైపై సంపాదన ఎంతో ఉహించుకోవచ్చు. ఇక్కడి ఉద్యోగి ఒక వ్యక్తి నుండి వివాహ ధ్రువ పత్రం ఇవ్వడానికి ఐదు వందల రూపాయలు తీసుకొని, రశీదు ఇచ్చేందుకు  నిరాకరించాడు.. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డ్‌ అయ్యాయి. 
నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిబ్బంది
మంత్రి కేటీఆర్. ఇలాఖాలో ఇలా జరగడం చర్చనీయాంశమయ్యింది. మంత్రి ప్రతి సందర్భములోనూ పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాది ముభారాక్ పథకాలను ప్రవేశ పెట్టామని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెబుతుండేవారు. కానీ ఇక్కడి సిబ్బంది మాత్రం ఎవరేమన్నా మా లెక్కలు మాకు రావాలి అంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదిలావుంటే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతిరోజు 10 నుంచి 15 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని... రిజిస్ట్రేషన్‌కు కేవలం ప్రభుత్వం నిర్ణయించిన సొమ్ము కడితే సరిపోతుందంటున్నారు సబ్‌ రిజిస్ట్రార్‌. 
మంత్రి కేటీఆర్‌ ఇలాఖాలోనే సిబ్బంది అక్రమాలు
సాక్ష్యాత్తు మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇకనైనా ప్రభుత్వం మేల్కోని అవినీతిని అరికడతామంటూ మాటలు చెప్పకుండా అవినీతికి పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

 

Don't Miss