వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ

09:25 - March 21, 2017

హైదరాబాద్ : ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసు ఓటింగు వైసీపీ అభ్యర్థుల విజయాన్ని దెబ్బతీసింది. మూడు జిల్లాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధుల క్రాసు ఓటింగుతో ముగ్గురు అభ్యర్థులు ఓడిపోయారు. కడప నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి, నెల్లూరు  నుంచి ఆనం విజయకుమార్‌రెడ్డి, కర్నూలు నుంచి గౌరు వెంకటరెడ్డి పరాజయం పాలయ్యారు. ఇందుకు దారితీసిన పరిస్థితులపై వైసీపీ నేతలు సమీక్షించుకుంటున్నారు. 
క్రాసు ఓటింగ్ 
ఏపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాసు ఓటింగ్ వైసీపీకి శాపంగా పరిణమించింది. వైపీసీ ప్రజా ప్రతినిధులు క్రాసు ఓటింగుకు పాల్పడంలో పార్టీ అభ్యర్థులు  కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఓటమి చవిచూశారు. స్థానిక సంస్థల్లో వైపీసీ బలం ఉన్నా కడప నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డి, కర్నూలు నుంచి గౌరు వెంకటరెడ్డి, నెల్లూరు నుంచి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి ఓడిపోయారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైపీసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 
వాకాటి నారాయణరెడ్డికి 87 ఓట్ల ఆధిక్యత 
నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి..తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన ఆనం విజయకుమార్‌రెడ్డిపై విజయం సాధించారు. నారాయణరెడ్డికి 87 ఓట్లు ఆధిక్యత వచ్చింది. అయితే నారాయణరెడ్డికి ఇంకా ఎక్కువు మెజారిటీ రావాలన్నది తెలుగుదేశం నేతల వాదన. టీడీపీలో కొందరు క్రాసు ఓటింగుకు పాల్పడ్డారని  విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ శిబిరంలో 515 మంది ఓటర్లు ఉన్నారని టీడీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు. కానీ వాకాటి నారాయణరెడ్డికి 465 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈయనకు పడిన ఓట్లలో ఏడు మురిగిపోయాయి. మొత్తం 45 ఓట్లు వైసీపీ ఆనం విజయకుమార్‌రెడ్డికి  అనుకూలంగా పడినట్టు తేల్చారు. క్రాసు ఓటింగుకు పాల్పడినవారు ఎవరన్న అంశంపై తెలుగుదేశం నేతలు ఆరా తీస్తున్నారు. పదిరోజుల పాటు నమ్మకంగా టీడీపీ శిబిరంలో ఉండి పోలింగు రోజు 45 మంది  వైసీపీ ఓటు వేయడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో ఎవరు క్రాసు ఓటింగు చేశారు, వీరికి వెనుక టీడీపీ నేతలు ప్రోద్బలం ఏమైనా ఉందా ? అన్న కోణంలో పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. పార్టీలో బలమైన నేతల ఆదేశాలు లేకుండా టీడీపీ శిబిరంలోని ప్రజా ప్రతినిధులు  క్రాసు ఓటింగుకు పాల్పడే అవకాశంలేదని భావిస్తున్నారు. వీరు ఎవరన్న విషయం తేల్చే పనిలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. 
నెగ్గిన శిల్పాచక్రపాణిరెడ్డి 
కర్నూలు జిల్లాలో కూడా క్రాసు ఓటింగు జరిగినట్టు టీడీపీ, వైసీపీ నేతలు చెబుతున్నారు. ఉత్కంఠ భరింగా సాగిన ఓట్ల లెక్కింపులో మొదట్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. కానీ టీడీపీ ప్రజాప్రతినిధుల క్రాసు ఓటింగుతో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి 38 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఆ తర్వాత శిల్పా చక్రపాణిరెడ్డి పుంజుకున్నారు. చివరకు 62 ఓట్ల ఆధిక్యతంలో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపుపొందారు. కర్నూలు జిల్లాలో ఉన్న 1084 ఓట్లలో 1077 పోలయ్యాయి. వీటిలో 11 ఓట్లు చెల్లలేదు. శిల్పా చక్రపాణిరెడ్డికి  564 ఓట్లు రాగా, వైపీసీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి 502 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీటీడీ ప్రజా ప్రతినిధుల క్రాసు ఓటింగుతో తన మెజారీటీ తగ్గిందంటున్న శిల్పా చక్రపాణిరెడ్డి... ఈ విషయాన్ని టీటీడీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి...
వైపీసీ ఓట్లకు భారీగా గండి
వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లాలో కూడా క్రాసు ఓటింగు జరిగింది. వైపీసీ గుర్తుపై నెగ్గిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బలం ఉందని గట్టినా నమ్మిన వైసీపీకి వైఎస్‌ వివేకానందరెడ్డి ఓటమితో అనూహ్య పరిణామం ఎదురైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్దేల్‌ శాసనసభ్యుడు జయరాములు,   ఎమ్మెల్సీ చెంగల్‌రాయుడు టీడీపీలో చేరడంతో వైపీసీ ఓట్లకు భారీగా గండిపడింది. ఎమ్మెల్యేలతోపాటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,  కడప నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు పదుల సంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో వివేకానందరెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

 

Don't Miss